Fake Police Station: బీహార్‌లో ఓ వ్యక్తి ఏకంగా నకిలీ పోలీసు స్టేషన్‌ను ఏర్పాటు చేసి సంవత్సరం పాటు యథేచ్ఛగా దందాలు చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పూర్ణియా జిల్లాలోని మోహని గ్రామంలో రాహుల్ కుమార్ షా అనే వ్యక్తి ఫేక్ పోలీస్ స్టేషన్ ప్రారంభించాడు. ఉద్యోగాల ముసుగులో ఆ గ్రామంలోని యువత నుంచి లక్షల రూపాయలు కాజేసినట్లు తెలింది. కాగా, గ్రామీణ రక్షాదళ్ రిక్రూట్‌మెంట్ పేరుతో కానిస్టేబుల్, చౌకీదార్‌ల అక్రమ నియామకాలు చేపట్టాడు సదరు వ్యక్తి.
Read Also: Chenab Bridge: విమాన ప్రయాణికులకు ప్రత్యేక ఆకర్షణగా చినాబ్ బ్రిడ్జి.. పైలట్లు ఏం చేస్తున్నారంటే..!
అయితే, స్థానిక యువత నుంచి రూ.25 వేల నుంచి 50 వేల రూపాయల వరకు వసూలు చేసి.. వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్లు నిందితుడు రాహుల్ కుమార్ షా వెల్లడించాడు. అలాగే, వారికి పోలీసు యూనిఫాంలు, లాఠీలు, నకిలీ ఐడీ కార్డులు సైతం అందజేశాడు. వారితో పెట్రోలింగ్, లిక్కర్ అక్రమ రవాణాపై దాడుల లాంటివి చేయించాడు. వచ్చిన డబ్బులో సగం తాను తీసుకొని.. మిగతా సగాన్ని తన కింది ఉద్యోగులకు అతడు అందజేసేవాడు. అక్రమ రవాణాదారుల నుంచి హస్తగతం చేసుకున్న మద్యాన్ని.. లంచాలు తీసుకుని వాటిని మరలా వారికే ఇచ్చేసేలా ప్లాన్ చేసుకున్నాడు. దాదాపు సంవత్సరం పాటు ఇలా నకిలీ పోలీసుల ఆగడాలు కొనసాగాయి. అయితే, ఎట్టకేలకు గుట్టు బయటపడటంతో రాహుల్ కుమార్ షా పరారయ్యాడు. అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.