ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో ఎమ్మెల్సీ కారులో మృతదేహం ఉండటం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అది వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు వద్ద గతంలో డ్రైవర్‌గా పని చేసిన వీధి సుబ్రహ్మణ్యం మృతదేహంగా పోలీసులు గుర్తించారు. అర్థరాత్రి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి డ్రైవర్‌కి సమాచారం ఇచ్చిన ఎమ్మెల్సీ.. యంగా ఆయనే తన కారులో తెల్లవారు జామున రెండు గంటలకు మృతదేహాన్ని తీసుకొచ్చారు. డ్రైవర్ తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో.. బాడీని, తన కారుని అక్కడే వెదిలేసి, మరో కారులో అనంత బాబు వెళ్ళిపోయారు.
రోడ్డు ప్రమాదంలో సుబ్రహ్యణ్యం చనిపోయాడని అనంత బాబు చెప్తుండగా.. తన బిడ్డను కొట్టి చంపి ఉంటారని డ్రైవర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిన్న రాత్రి తమ ఇంట్లో పడుకున్న సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్సీ అనుచరులు తీసుకెళ్ళారని కుటుంబీకులు చెప్తున్నారు. గతంలో అనంత బాబు వద్ద సుబ్రహ్మణ్యం ఐదేళ్ళు డ్రైవర్‌గా పని చేశాడు. కాగా.. నిన్న అనంతబాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన అనుచరులు పార్టీలో మునిగితేలారు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.