హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఒకవైపు మదర్స్ డే వేడుకలకు ప్రపంచం సిద్ధం అవుతోంది. అయితే హైదరాబాద్ లో ఓ కొడుకు తల్లిని దారుణంగా చంపేశాడు. జంగయ్య,భూదేవి (58)అలియాస్ లక్ష్మి దంపతులు దిల్ సుక్ నగర్ న్యూ గడ్డి అన్నారం కాలనీలో నివాసముంటున్నారు. వీరికి సంతానం లేకపోవడంతో సాయి తేజ అనే యువకుడిని దత్తత తీసుకున్నారు. అతని వయసు 27 సంవత్సరాలు. శుక్రవారం రాత్రి జంగయ్య కింద గ్రౌండ్ ఫ్లోర్ లో నిద్రపోయాడు. తల్లి భూదేవి,దత్తపుత్రుడు సాయి తేజ లు మొదటి అంతస్తులో పడుకున్నారు. అంతా బాగానే వుంది.
అయితే జంగయ్య ఉదయం పైకి వచ్చే వరకు భూదేవి అపస్మారక స్థితిలో ఉంది.పరిశీలించగా అప్పటికే ఆమె మరణించింది. సాయి తేజ కనిపించకుండా పోయాడు. ఇంట్లో ఉన్నటువంటి 30 గ్రాముల బంగారు ఆభరణాలు, నగదు తీసుకొని సాయితేజ పరారయ్యాడు. జంగయ్య వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆమె ముక్కూ నోరు మూసి, ఊపిరి ఆడకుండా చేయడంవల్ల మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. సాయి తేజ కోసం సరూర్ నగర్ పోలీసులు గాలింపు జరుపుతున్నారు.
ఇంట్లో సీసీ కెమేరాలు కట్ అయి వున్నాయి. పెంపుడు తల్లిని హత మార్చిన కొడుకు సాయి తేజ తన ఆనవాళ్లు గుర్తుపట్టకుండా ఉండేందుకు ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి పారిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కన్న కొడుకు కాకపోయినా ఎంతో ప్రేమగా పెంచిన కొడుకు కసాయిలా మారడంతో జంగయ్య కన్నీరుమున్నీరవుతున్నారు.