ఈ కాలంలో ప్రేమ ఎప్పుడు, ఎవరి మధ్యన పుడుతుందో చెప్పఁడం కష్టం.. అలాగే ఎవరిని నమ్మాలో, లేదో కూడా చెప్పలేకపోతున్నాం.. ఎంతగానో ప్రేమించినవారే నమ్మక ద్రోహం చేస్తున్నారు. ప్రేమ పేరుతో నమ్మించి, శారీరక వాంఛలు తీర్చుకొని, ఆ సమయంలో నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తాజాగా ఒక యువకుడు తన ప్రేయసి నగ్న వీడియోలను బయటపెడతానని ఆమెను బెదిరించడంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లాలో వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. పెనమలూరు మండలం కానూరుకు చెందిన ఒక యువతికి కొన్ని నెలల క్రితం వాట్సాప్ ద్వారా ఒక యువకుడు పరిచయమయ్యాడు. కొద్దిరోజులకే ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తాను సౌదీ అరేబియాలో ఉంటున్నానని , వచ్చాక డబ్బు ఇస్తానని నమ్మించి యువతివద్ద రూ. 1.5 లక్షలు తీసుకున్నాడు. ఆ తరువాత కొద్దిరోజులు ఇండియా వచ్చినట్లు తెలిపి ఆమెతో చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు. అప్పుడే ఆమె పర్సనల్ వీడియోలను తీశాడు. ఇక యువతి పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనేసరికి మొహం చాటేశాడు. ప్రియుడు మోసం చేయడంతో యువతి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొంది.
నెల రోజులు కాపురం కూడా చేయకముందే మాజీ ప్రియుడు ఆమె నగ్న వీడియోలతో ప్రత్యేక్షమయ్యాడు. తనతో మళ్లీ మాట్లాడాలని, లేకపోతే తన దగ్గర ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఈ విషయమై యువతి పెనుములూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయినా మాజీ ప్రియుడు ఆగడాలు ఆగకపోవడంతో కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చి చీమల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. సకాలంలో స్పందించిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి రక్షించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.