ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడికి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పి లాడ్జీకి పిలిపించిన బాలికపై ముగ్గురు బీటెక్ విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటన.. జిల్లాలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలికకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి పరిచయం అయ్యాడు.
మొదట్లో చాటింగ్‌లో మాటలు కలిశాయి. ఆపై స్నేహం పేరుతో ఇద్దరు బయట కలుసుకున్నారు. ఆ తర్వాత ప్రేమ పేరుతో ఆ బాలికకు దగ్గరయ్యాడు బీటెక్ విద్యార్థి. అతని మాయమాటల్ని నమ్మిన ఆ బాలిక, అతని వలలో పడింది. నిజంగానే ప్రేమిస్తున్నాడని నమ్మి, అతనిపై మనసు పారేసుకుంది. తను వేసిన వలలో ఆ బాలిక చిక్కుకోవడంతో, అతడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ పన్నాగం పన్నాడు. గుంటూరులోని ఓ లాడ్జీలో రూము తీసుకున్నాడు. తొలుత తన ఇద్దరు స్నేహితులతో కలిసి, మద్యంలో మునిగితేలాడు. అనంతరం.. ఆ ముగ్గురిలో ఒకరు బుధవారం సాయంత్రం ఆ బాలికకి ఫోన్ చేసి, ప్రియుడికి యాక్సిడెంట్ అయ్యిందని, తామంతా లాడ్జీలో ఉన్నామని చెప్పాడు.
ప్రియుడికి ప్రమాదం జరిగిందన్న విషయం తెలిసి టెన్షన్ పడ్డ ఆ అమ్మాయి, వెంటనే అతడ్ని చూసేందుకు లాడ్జీకి వెళ్లింది. తీరా అక్కడికెళ్లి చూస్తే, ప్రియుడు మద్యం మత్తులో నిద్రపోతున్నాడు. ఆ ఇద్దరు స్నేహితులు కూడా గంజాయి మత్తులో ఉన్నారు. ఇదేంటని ఆ బాలిక ప్రశ్నించేలోపే.. ఇద్దరు స్నేహితులు ఆమెను లోపలికి బలవంతంగా లాక్కెళ్లి మద్యం తాగించారు. ఆపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ కామాంధుల నుంచి తనని తాను కాపాడుకోవడానికి ప్రయత్నించింది కానీ, వీలు పడలేదు. బలవంతంగా మద్యం తాగించడంతో, ఆ మత్తులో బాలిక ఎదురించలేకపోయింది.
తెల్లారిన తర్వాత ఇంటికొచ్చిన అమ్మాయి నీరసంగా కనిపించడంతో.. కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందని ఆరా తీయడంతో, ఆ బాలిక జరిగిందంతా వినిపించింది. దీంతో హతాశయులైన తల్లిదండ్రులు.. ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్‌లో ఆమెపై అఘాయిత్యం జరిగినట్టు తేలింది. దీంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. లాడ్జీలో ఉండగానే నిందితుల్ని అరెస్ట్ చేశారు.