మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. కదులుతున్న కారులోనే ఆమెపై ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
బాలికకు నిందితుల్లో ఒకరితో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఉంది. ఆ స్నేహంతో ఒక రోజు కలవాలంటూ బయటకు పిలిచాడు. దీంతో ఆ బాలిక.. ఒక స్థలానికి రాగానే అప్పటికే కారులో వేచి ఉన్న మరో ఇద్దరు స్నేహితులు.. రైడింగ్‌కు వెళ్దామంటూ ఆహ్వానించారు. కారులోకి ఎక్కగానే ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు. ఈ దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించారు. అంతే.. ఈ వీడియోను అడ్డంపెట్టుకుని ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. తమతో బయటకు రావాలంటూ భయపెట్టారు. లేదంటే వీడియో మీ పేరెంట్స్‌కు పంపిస్తామని బెదిరింపులకు దిగారు. అయినా ఆమె వారితో వెళ్లేందుకు నిరాకరించింది. కానీ నిందితులు మాత్రం అన్నంత పని చేశారు. అత్యాచార వీడియోను అమ్మాయి పేరెంట్స్‌కు పంపించారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించగా… ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై అత్యాచారం, కిడ్నాప్ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
బాలికతో మైనర్‌కు స్నేహం ఉందని.. ఆ చనువుతోనే ఆమె అతడి దగ్గరకు వెళ్లిందని పోలీసులు తెలిపారు. అతడి దగ్గరకు వెళ్లగానే కారులో రైడ్‌కు వెళ్దామని కారు ఎక్కించుకున్నాడని.. అందులో అప్పటికే మరో ఇద్దరు స్నేహితులు ఉన్నారని చెప్పారు. కారు హైవేపైకి వెళ్లాక.. ఒకరి తర్వాత ఒకరు గ్యాంగ్‌రేప్ చేశారని పోలీసులు వెల్లడించారు. వీడియో ద్వారా ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఆమె నిరాకరించడంతో.. కుటుంబ సభ్యులకు పంపించారని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు.. కుమార్తెను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారన్నారు. విద్యార్థిని వాంగ్మూలం ప్రకారం ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారని పోలీస్ అధికారి తెలిపారు. త్వరలోనే పట్టుకుంటామని మోహనా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రషీద్ ఖాన్ చెప్పారు. పరిచయస్తులతో జాగ్రత్తగా ఉండాలని అమ్మాయిలకు పోలీసులు సూచిస్తున్నారు.