Uttar Pradesh: మానవ రూపాల్లో ఉన్న మృగాళ్లు రెచ్చిపోతున్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దేశంలో ఎక్కడోచోట రోజుకు ఒక్కటైన ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా అభంశుభం తెలియని చిన్నారులపై కూడా లైంగికదాడులకు తెగబడుతున్నారు. నిర్భయ, పోక్సో వంటి కఠిన చట్టాలు ఉన్నా కూడా వాటికి భయపడకుండా, బరితెగించి ప్రవర్తిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ లో ఓ సంఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. కంప్యూటర్ విద్యను బోధిస్తున్న టీచర్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 12 మంది బాలికను లైంగికంగా వేధించినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఈ ఘటన యూపీలోని షాజహాన్ పూర్ తిల్హార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కంప్యూటర్ నేర్పిస్తున్న మహ్మద్ అలీ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కేసుతో నిందితుడితో పాటు ప్రిన్సిపాల్ అనిల్ కుమార్, అసిస్టెంట్ టీచర్ సాజియాపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.
Read Also: Karnataka: లోపల కాంగ్రెస్ మీటింగ్.. బయట ఫైటింగ్.. బెంగళూర్‌లో టెన్షన్
తిల్హార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక జూనియర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న దళితులతో సహా 12 మంది బాలికలను కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ మహ్మద్ అలీ వేధించారని సర్కిల్ ఆఫీసర్ (తిల్హార్) ప్రియాంక్ జైన్ తెలిపారు. తొలుత ఈ విషయమై కొందరు బాలికలు ప్రధానోపాధ్యాయుడు కుమార్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని అధికారులు తెలిపారు. ఈ విషయంలో అసిస్టెంట్ టీచర్ సాజియా ప్రమేయం కూడా ఉందని, శనివారం ఓ దళిత విద్యార్థిని నిందితుడు అలీ వేధించాడు, ఆ తరువాత విద్యార్థినులు తమ ఇళ్లకు వెళ్లిన తర్వాత విషయాన్ని కుటుంబాలకు తెలియజేశారు. గ్రామపెద్ద లల్తా ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన తర్వాత గ్రామస్తులు అంతా పాఠశాల ముందు ఆందోళన చేశారు. ముగ్గురు నిందితులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, పోక్సో, అత్యాచార నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. విద్యాశాఖ అధికారులు విద్యార్థుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో మాట్లాడారు. ప్రాథమిక వివరాలను బట్టి చూస్తే కంప్యూటర్ బోధకుడిదే తప్పగా తేలింది. దీనిపై విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.