తెలుగు ఓటీటీ సంస్థ ఆహా వీక్షకులకు డిఫరెంట్ కంటెంట్ ఇవ్వడానికి రకరకాలుగాప్రయత్నిస్తోంది. వేరే భాషల్లోని వెబ్ సీరిస్ ను తెలుగులో రీమేక్ చేయడంతో పాటు, పాపులర్ డైరెక్టర్స్ తోనూ వెబ్ సీరిస్ ప్లాన్ చేస్తోంది. అలా రూపుదిద్దుకుందే ‘త్రీ రోజెస్’. మారుతి షో రన్నర్ గా వ్యవహరించిన ఈ సీరిస్ ను ఎస్.కె.ఎన్. నిర్మించాడు. మ్యాగీ డైరెక్ట్ చేశాడు. పూర్ణ, ఇషా రెబ్బ, పాయల్ రాజ్ పుత్ టైటిల్ రోల్ ప్లే చేసిన ‘త్రీ రోజెస్’ వెబ్ సీరిస్ లోని తొలి నాలుగు భాగాలు నవంబర్ 12 నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
పెళ్ళికి ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే చాలు… గుండెల మీద కుంపటిలా ఫీల్ అయ్యే తల్లిదండ్రులే ఎక్కువ. ఏదో రకంగా అమ్మాయి పెళ్ళి చేసి, అత్తవారింటికి పంపాలని భావిస్తుంటారు. యేళ్లు గడిచినా ఆడపిల్ల తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో మార్పు రాలేదని చెప్పే వెబ్ సీరిస్ ఇది. అందుకోసం భిన్నమైన నేపథ్యాలు ఉన్న ముగ్గురమ్మాయిల కథను దర్శకుడు మ్యాగీ ఎంచుకున్నాడు. ఈ ముగ్గురు అమ్మాయిల మనస్తత్త్వాన్ని, వారికి తల్లిదండ్రులతో ఉండే అనుబంధాన్ని మొదటి మూడు ఎపిసోడ్స్ లో చూపించాడు. ‘ది గర్ల్ నెక్ట్స్ డోర్’ అనే ఫస్ట్ ఎపిసోడ్ రీతు (ఇషారెబ్బ) కుటుంబానికి సంబంధించింది. బెంగళూరులో యాడ్ ఏజెన్సీలో పనిచేసే రీతుని తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నామని హైదరాబాద్ వచ్చేయమంటారు. రొటీన్ పెళ్ళి చూపుల వ్యవహారంతో ఆమె విసిగి వేసారి పోతుంది. చిత్రంగా నాటకీయ పరిణామాల మధ్య జ్యూయలరీ షాప్ ఓనర్ వైవా హర్షతో ఆమెకు నిశ్చితార్థం జరుగుతుంది. ఇక రెండో ఎపిసోడ్ ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’. పేరుకు తగ్గట్టుగానే ఇది బోల్డ్ ఎపిసోడ్! రియల్ ఎస్టేట్ అధినేత, మల్టీ మిలియనీర్ స్టాన్లీ కూతురు జాన్వీ (పాయల్ రాజ్ పుత్). తల్లి సరళ అంటే ఆమెకు గిట్టదు. భర్త చేసే అతి గారాబంతో కూతురు ఎక్కడ చేజారి పోతుందోనని ఆమె తల్లి భయపడుతూ ఉంటుంది. ఆమె భయం నిజం అవుతుంది కూడా. పబ్ కల్చర్ ను ఒంటబట్టించుకున్న జాన్వీ తనకు నచ్చినట్టే ఉంటుంది. నచ్చిన పనే చేస్తుంది. ఎవరినైనా ఇట్టే నమ్మేసి, వాళ్ళకు శరీరాన్ని అప్పటించడానికీ వెనుకాడదు. కూతురు అమాయకురాలు అనుకునే స్టాన్లీకి జాన్వీ ఓ రోజున ఊహించని షాక్ ఇస్తుంది. లక్కీగా దాన్ని కూడా అతను తప్పుగానే అర్థం చేసుకుంటాడు. అయితే తాను చేస్తోంది తప్పు అనే విషయం మాత్రం జాన్వీకి బోధపడుతుంది. ఈ ఎసిసోడ్ కు సంబంధించిన విశేషం ఏమంటే… ఇందులో జాన్వీ పెళ్ళిచూపుల తతంగం పేరుతో లవ్ మేకింగ్ చేసే వ్యక్తి ప్రత్యూష్ గా నటించింది, నిజ జీవితంలోని ఆమె బోయ్ ఫ్రెండ్ సౌరభ్. దాంతో ఆ సీన్స్ అన్నీ రక్తి కట్టాయి. ఇక మూడో ఎపిసోడ్ ‘డ్రామా క్వీన్’. మూడు పదులు నిండినా పెళ్ళికానీ ఇంద్రజ (పూర్ణ) కథ ఇది. తండ్రి చనిపోవడంతో ఆమె బాబాయ్ వీరి కుటుంబాన్ని ఆదుకునే నెపంతో అన్నయ్య ఉద్యోగాన్ని పొందుతాడు. కానీ వదినను, అన్న కూతుర్ని మాత్రం పెద్దగా పట్టించుకోడు. అయితే బాబాయ్ మొదట్లో తెచ్చిన సంబంధాలను తిరస్కరించిన ఇందు…. వయసు అయిపోయిన తర్వాత పెళ్ళి ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తూ ఉంటుంది. బాబాయ్ కుటుంబంతో ఆమెకు ఉన్న అనుబంధం, యుక్త వయసులో పెళ్ళిచూపుల తతంగం, థర్టీ ప్లస్ తర్వాత ‘సత్యం’ రాజేశ్ తో కెఫేలో జరిగే పెళ్లి చూపులతో ఈ ఎపిసోడ్ సాగిపోతుంది. మొత్తం మీద ముగ్గురు అమ్మాయిలు, వారి కుటుంబ సభ్యుల పరిచయాలు, పెళ్ళి చూపుల వ్యవహారాలతో మూడు ఎపిసోడ్స్ సాగిపోయాయి. నాలుగో ఎపిసోడ్ ‘ది మ్యాడ్ నెస్ బిగెన్స్’. ఇంట్లో వాళ్ళ ప్రవర్తనతో ఫ్రస్ట్రేషన్ కు గురైన ఈ ముగ్గురు అమ్మాయిలు కలిసి, పబ్ కు వెళ్ళాక అక్కడ ఏం జరిగిందన్నదే ఈ ఎపిసోడ్!
చిత్రం ఏమంటే భిన్నమైన నేపథ్యాలు కలిగిన ఈ ముగ్గురమ్మాయిలకు ఫ్రెండ్ షిప్ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైందో దర్శకుడు ఎక్కడా చెప్పలేదు. అలానే పాత్రల పరిచయంతో సాగే మొదటి మూడు ఎపిసోడ్స్ లో పెళ్ళి చూపుల తతంగం అనేది రిపీట్ సీన్స్ తో బోర్ కొట్టిస్తుంది. గతంలో వినీ వినీ అరిగిపోయిన డైలాగ్స్ తోనే కొన్ని సీన్స్ ను నడిపేశారు. అయితే ఓవర్ ఆల్ గా మాత్రం రవి నంబూరి రాసిన సంభాషణలు బాగున్నాయి. ‘మనిషా నిమ్స్ జనరల్ వార్డా!?’ ‘పెళ్ళి చేద్దాం అనుకోవడానికి పెళ్ళి చేసేద్దాం అనుకోవడానికీ తేడా ఉంది’ వంటి సంభాషణలతో పాటు కామెడీ సన్నివేశాలలో పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. కొన్ని చోట్ల హద్దులు మీరాయి కూడా! బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ ప్రతి ఫేమ్ ను రిచ్ గా చూపించింది. అలానే ఎం. ఆర్. సన్నీ మ్యూజిక్ కూడా ఈ వెబ్ సీరిస్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. నేపథ్యంలో వచ్చే పాటలూ బాగున్నాయి.
నటీనటుల్లో ఈషా రెబ్బ చక్కని పెర్ఫార్మెన్స్ కనబరిచింది. పాయల్ ‘ఆర్.ఎక్స్. 100’ కు కొనసాగింపు పాత్ర చేసినట్టే ఉంది. పూర్ణలోని అమాయకత్వాన్ని, గడుసుతనాన్ని కూడా దర్శకుడు చక్కగా చూపించే ప్రయత్నం చేశాడు. ఇతర ప్రధాన పాత్రలలో వైవా హర్ష, సత్యం రాజేశ్, నాగ మహేశ్, గోపరాజు రమణ, సరయు, హేమ, ఇషాన్ తదితరులు కనిపిస్తారు. ఇక కీ-రోల్స్ చేసిన ప్రిన్స్, సంగీత్ శోభన్ ఎంట్రీ ఇంకా జరగలేదు. కేవలం పాత్రల పరిచయం, వారి సమస్యలతో ఈ నాలుగు ఎపిసోడ్స్ నూ లాగించేసిన దర్శకుడు మ్యాగీ వీటికి సమాధానాలను నవంబర్ 19న స్ట్రీమింగ్ చేసే బాలెన్స్ నాలుగు ఎపిసోడ్స్ లో చూపించబోతున్నాడు. అడల్ట్ కంటెంట్ తో వెబ్ సీరిస్ తీస్తే జనం ఆదరిస్తారనే భ్రమ ఓటీటీ సంస్థల అధినేతలలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. గతంలో అలాంటి వెబ్ సీరిస్ తీసి, భంగపడిన సందర్భాలూ ఉన్నాయి. అయినా అదే తప్పును మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. ఫీల్ గుడ్ వెబ్ సీరిస్ లకు లభించే ఆదరణ, అడల్ట్ కంటెంట్ వెబ్ సీరిస్ కు లభించడం కల్ల. ఇప్పుడీ వెబ్ సీరిస్ దీ అదే పరిస్థితి. వారం తర్వాత స్ట్రీమింగ్ చేసే బాలెన్స్ నాలుగు ఎపిసోడ్స్ లో గుడ్ కంటెంట్ ఏమైనా ఉంటే, ‘త్రీ రోజెస్’ కు ఆదరణ లభిస్తుంది. లేదంటే పాపులర్ హీరోయిన్లు చేసిన వెబ్ సీరిస్ ఒకటి ఆహాలో ఉంది అని తృప్తి పడాలి. అంతే!!
ప్లస్ పాయింట్స్
గుర్తింపు ఉన్న ఆర్టిస్టులు నటించడం
కామెడీకి పెద్ద పీట వేయడం
ప్రొడక్షన్ వాల్యూస్
మైనెస్ పాయింట్స్
కథలో కొత్తదనం లేకపోవడం
బోర్ కొట్టించే రిపీట్ సీన్స్
రేటింగ్ : 2.5 / 5
ట్యాగ్ లైన్ : పిక్చర్ అభీ బాకీ హై!