స్టార్ హీరో సూర్య నటించిన ‘సూరారై పోట్రు’ తర్వాత ఓటీటీలో విడుదలైన మరో పెద్ద సినిమా ‘జగమే తంత్రం’. ధనుష్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతోందనే వార్తలు వచ్చినప్పుడు ధనుష్ తో పాటు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సైతం ఖండించారు. కానీ పరిస్థితులు మెరుగుపడకపోవడంతో చివరకు రాజీ పడాల్సి వచ్చింది. వైనాట్ పతాకంపై శశికాంత్ నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. శుక్రవారం నుండి తమిళంతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను చూసే ఆస్కారం ఏర్పడింది.
కథ విషయానికి వస్తే… సురులి (ధనుష్) మధురైకి చెందిన ఓ చిన్న గ్యాంగ్ స్టర్. తన ఊరిలో వేరే ప్రాంతం వాళ్ళు వచ్చి వ్యాపారం చేయడాన్ని అతను సహించలేడు. మిత్రులతో కలిసి హోటల్ నడుపుతూ, చిన్నచిన్న దందాలు చేస్తూ కాలం గడిపేస్తుంటాడు. ఇదే సమయంలో లండన్ లో రెండు అండర్ వరల్డ్ గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు తీవ్రతరమౌతుంది. శ్రీలంక నుండి దొడ్డిదారిన లండన్ వచ్చే తమిళులకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు వివిధ దేశాల నుండి వచ్చిన శరణార్థులను కాపాడుతుంటాడు శివదాస్ (జోసఫ్ జోజు జార్జ్). అందుకు అవసరమైన డబ్బు సమకూర్చుకోవడానికి మారణాయుధాల అక్రమ రవాణా దందా చేస్తుంటాడు. అతనికి పోటీగా లండన్ కు చెందిన రెసిస్ట్ పీటర్ (జేమ్స్ కాస్మో) నిలుస్తాడు. అక్రమంగా లండన్ కు వచ్చే శరణార్థులను బంధించి, తన కార్యకలాపాలకు వాడుకుంటాడు. అలానే రేసిస్టులకు వ్యతిరేకంగా లండన్ లో జరుగుతున్న ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తుంటాడు. తన చర్యలకు శివదాస్ అడ్డంకిగా మారడంతో అతన్ని తప్పించడానికి నెలరోజుల కాంట్రాక్ట్ మీద తమిళనాడు నుండి గ్యాంగ్ స్టర్ సురులి ని లండన్ పిలిపించుకుంటాడు పీటర్. లండన్ వచ్చిన సురులి… శివదాస్ ను అంతం చేశాడా? తమిళుడి కన్నును వారి వేలుతోనే పొడవాలని అనుకున్న పీటర్ ఎత్తుగడలు ఫలించాయా? శివదాస్ ను నమ్ముకుని లండన్ వచ్చిన తమిళ శరణార్థుల పరిస్థితి ఏమైంది? వీటికి సమాధానమే మిగిలిన సినిమా.
ఈ మధ్య కాలంలో కోలీవుడ్ దర్శక నిర్మాతల దృష్టి పరాయి దేశాల్లో బాధలు పడుతున్న తమిళులు, అక్కడి శరణార్థులపై పడింది. వారి కోసం పోరాటం చేసే నాయకుల కథలను తెర మీదకు తీసుకురావడానికి తాపత్రయపడుతున్నారు. పనిలో పనిగా ఎల్.టి.టి.ఇ. ఉద్యమం నీరు కారిపోయిన తర్వాత విదేశాలకు చేరి ఆ సంస్థ కార్యకలాపాలను గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న శ్రీలంక తమిళులకు మద్దత్తుగా కొందరు సినిమాలు తీస్తున్నారు. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని శ్రీలంక నుండి ఇటు భారత్ తో పాటు పలు దేశాలకు వెళ్ళిపోయిన తమిళుల బాధలను సానుభూతితో అర్థం చేసుకోవాల్సిందే. అయితే… ఏ దేశమైన శరణార్థుల కారణంగా తమ అస్థిత్త్వానికి ముప్పు ఏర్పడుతుందని గ్రహించినప్పుడు వారి పట్ల కఠినంగా వ్యవహరించడం సాధారణం. మొదట నిర్లిప్తంగా వ్యవహరించిన చాలా దేశాలు ఇప్పుడు రోహింగ్యాల కారణంగా శాంతిభద్రతల సమస్యను ఫేస్ చేస్తున్నాయి. కాని కొందరు దర్శక నిర్మాతలు శరణార్థుల సమస్యను జనరలైజ్ చేసి చూపిస్తున్నారు. ‘జగమే తంత్రం’లోనూ అదే జరిగింది. ఓ మనిషికి తన ఊరు అంటే ఏది? జన్మించిన ప్రదేశమా? జీవితాన్ని ఇచ్చిన ప్రదేశమా? అనేది పెద్ద ప్రశ్న. ఇందులోనూ కథ ఆ ప్రశ్న చుట్టూనే తిరుగుతుంది. శ్రీలంక లో తమిళులుగా ఉన్న తాము భారత్ లో శరణార్థులుగా మారడం ఏమిటనే ప్రశ్నను కొందరు వేస్తారు. రాజకీయ వైకుంఠపాళిలో శ్రీలంక తమిళులు పావులయ్యారన్నది మాత్రం వాస్తవం.
నటీనటుల విషయానికి వస్తే… ధనుష్ సురులిగా బాగానే నటించాడు. శరీరంలో కండలేకపోయినా… గ్యాంగ్ స్టర్ పాత్రలో మెప్పించాడు. కొన్ని చోట్ల మావ రజనీకాంత్ స్టైల్ ను ఇమిటేట్ చేశాడు. ఇందులో కొన్ని సన్నివేశాలు చూస్తే ‘కబాలి, కాలా’లో రజనీకాంత్ గుర్తొస్తారు. ఇక మలయాళ చిత్రసీమకు చెందిన ఐశ్వర్య లక్ష్మీ నాయికగా చక్కగా నటించింది. ఆమెది కూడా ప్రాధాన్యమున్న పాత్రే. అలానే శివదాస్ పాత్రకు జోసఫ్ జోజు జార్జ్, పీటర్ క్యారెక్టర్ కు జేమ్స్ కాస్మో నిండుతనం చేకూర్చారు. ధనుష్ తల్లిగా వడివుక్కరసి, అతని లండన్ స్నేహితుడిగా కలైయారసన్ నటించారు. వీళ్ళంతా ఆయా పాత్రలకు న్యాయం చేశారు. సంతోష్ నారాయణ్ సంగీతం, శ్రేయస్ కృష్ణ సినిమాటోగ్రఫీ బాగుంది. తెలుగులో రాసిన సంభాషణలు సహజంగా, చమత్కారంగా ఉన్నాయి. ‘ద్రోహి అనిపించుకోవడం చావుతో సమానం’ వంటి బలమైన సంభాషణలతో పాటు ‘చాలా రోజుల తర్వాత చూస్తున్న మెగాస్టార్ సినిమాల ఉంది’ అనే సరదా సంభాషణలు బాగున్నాయి. అయితే… ఇది తమిళుల కథ కావడంతో సినిమాలో చాలా సన్నివేశాలలో తమిళ పాటలనే నేపథ్యంలో వినిపించారు. దాంతో మనం చూస్తున్నది ఓ తమిళ అనువాద చిత్రం అనేది ప్రతి క్షణం బుర్రలో తొలుస్తూనే ఉంటుంది. లండన్ నేపథ్యంగా జరిగే అండర్ వరల్డ్ వ్యవహారాలకే పెద్ద పీట వేయడంతో దర్శకుడు ప్రధానంగా చర్చించాలని అనుకున్న శరణార్థుల వెతలు వెనక్కి వెళ్ళిపోయి, ఇదో గ్యాంగ్ స్టర్ డ్రామాగా మిగిలిపోయింది. పైగా ఇటీవల వచ్చిన ‘ది ఫ్యామిలీమ్యాన్’ వెబ్ సీరిస్ 2లోనూ ఇదే కథాంశాన్ని చర్చించడంతో దానితో పోలికా మొదలైంది. కమర్షియల్ యాంగిల్ లో దర్శకుడు ఆలోచించాడు తప్పితే… మెయిన్ కాజ్ కు బలమైన సీన్స్ రాసుకోలేదనే అభిప్రాయం వీక్షకులకు కలిగే ఆస్కారం ఉంది. దాంతో ఏ ఒక్క సన్నివేశం కూడా హృదయానికి హత్తుకోదు, అయ్యో అని బాధపడేలా చేయదు. ఏదేమైనా… నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది కాబట్టి… ధనుష్ అభిమానులు, సాధారణ వీక్షకులు ఓసారి చూసేయొచ్చు.
రేటింగ్ : 2.25 / 5
ప్లస్ పాయింట్స్
హీరో ధనుష్ నటన
లండన్ నేపథ్యం
సంభాషణలు, సంగీతం
మైనెస్ పాయింట్
సినిమా నిడివి ఎక్కువ కావడం
ఆసక్తి కలిగించని స్క్రీన్ ప్లే
పసలేని పాటలు
ట్యాగ్ లైన్: ఫలించని తంత్రం!