శ్రీ విష్ణు, మేఘా ఆకాష్, సునైన కీలక పాత్రలు పోషించిన సినిమా ‘రాజ రాజ చోర’. గురువారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. వాస్తవానికి భిన్నమైన స్క్రిప్ట్ లు ఎంపిక చేసుకుంటాడని శ్రీవిష్ణుకు పేరుంది. అయితే అతను నటించిన ముందు చిత్రం ‘గాలి సంపత్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దాంతో ఫస్ట్ లుక్ నుంచి అందరినీ ఆకట్టుకునేలా ‘రాజ రాజ చోర’ ప్రమోషన్స్ చేస్తూ వచ్చారు దర్శక నిర్మాతలు. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకుందా? లేదా? అన్నది చూద్దాం.
కథ విషయానికి వస్తే… భాస్కర్ (శ్రీవిష్ణు) జిరాక్స్ షాపులో పనిచేస్తూంటాడు. తన అవసరాలు తీర్చుకోవడానికి దొంగతనాలు చేస్తుంటాడు. ఇదే సమయంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నానని సంజన (మేఘా ఆకాష్)నునమ్మించి, ఆమెతో సహజీవనం మొదలు పెడతాడు. కానీ కొన్ని రోజులకు భాస్కర్‌కు వివాహమైందని, కుమారుడు కూడా ఉన్నాడన్న వాస్తవం సంజనకు తెలుస్తుంది. ఇదే సమయంలో పోలీస్ ఆఫీసర్ అయిన సంజన మావయ్య విలియం రెడ్డి (రవిబాబు) దృష్టిలో పడతాడు భాస్కర్. అక్కడ నుండి భాస్కర్ జీవితం ఊహించని మలుపుతు తిరుగుతుంది? సంజనను భాస్కర్ నిజంగానే మోసం చేశాడా? పెళ్ళి అయిన విషయాన్ని అతను ఎందుకు దాచిపెట్టాడు? విలియం రెడ్డి చేతిలోంచి భాస్కర్ ఎలా బయటపడ్డాడు? అనేది మిగతా కథ.
నటీనటుల విషయానికి వస్తే ముందు చిత్రాలతో పోలిస్తే శ్రీ విష్ణు చక్కటి కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతడి పాత్ర పూర్తిగా ఎంటర్ టైనింగ్ గా సాగింది. ఇంటర్వెల్ సీన్స్ లో అయితే ఇరగదీశాడు. ఆ మధ్య వచ్చిన ‘నీదీ నాది ఒకే కథ’లో నిస్సహాయుడైన విద్యార్థిగా నటించి మెప్పించిన శ్రీవిష్ణు… ఇందులో పరిస్థితుల ప్రభావంతో దొంగగామారిన ఓ మధ్య తరగతి మనిషిగా చక్కని నటన ప్రదర్శించాడు. అతని ప్రియురాలిగా మేఘా ఆకాష్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకర్షణీయంగా ఉంది. శ్రీవిష్ణు భార్యగా, లాయర్ గా మంచి పేరు తెచ్చుకోవాలని తాపత్రయ పడే గృహిణి పాత్రలో సునైనా చక్కగా ఒదిగిపోయింది. ముఖ్యంగా భర్త దొంగ అని తెలిసిన తర్వాత అతన్ని కాపాడే ప్రయత్నంలో పోలీస్ స్టేషన్ లో విలియం రెడ్డికి క్లాస్ పీకే సీన్ మూవీకి హైలైట్ అని చెప్పాలి. చాలా కాలం తర్వాత సునైన తెలుగు సినిమాలో నటించడం ఓ విశేషం అయితే… అందులో ఆమె పాత్రకు చక్కని ప్రాధాన్యం ఉండటం మరో విశేషం. ఇతర ప్రధాన పాత్రల్లో అజయ్ ఘోష్, వాసు ఇంటూరి, శ్రీకాంత్ అయ్యంగార్, గంగవ్వ, కాదంబరి కిరణ్, భరణి… అంతా తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. చాలాకాలం తర్వాత రవిబాబుకు ఓ పూర్తి స్థాయి పాత్ర దొరకడంతో అతనూ చక్కని నటన ప్రదర్శించాడు.
సాంకేతిక నిపుణుల పనితీరుకు వస్తే… దర్శకుడు హసిత్ గోలి తొలి ప్రయత్నంలోనే చక్కటి స్క్రిప్ట్‌తో వచ్చారు. ప్రతి వ్యక్తిలో ఉండే గ్రే షేడ్స్ ను తెర మీద చూపిస్తూనే, వారిలో సమాయానుకూలంగా వచ్చే మార్పులను చూపించడం బాగుంది. దాంతో మూవీ మరో మెట్టు పైకి వెళ్ళింది. హీరో క్యారెక్టరైజేషన్ తో పాటు మిగిలిన పాత్రలకూ చక్కటి ప్రారంభం, సరైన ముగింపు ఉండటం విశేషం. అయితే ద్వితీయార్ధంపై ఇంకా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఉండాల్సింది. వేద రామన్ శంకరన్ కెమెరా పనితనం బాగుంది. విజువల్స్ బాగున్నాయి. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కానీ క్యాచీ నెంబర్స్ పడి ఉంటే ఇంకా బెటర్ గా ఉండేది. ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా గొప్పగా ఉన్నాయి. అందుకు నిర్మాతలు టి. జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ను అభినందించాలి.
‘రాజ రాజ చోర’ ఎమోషనల్ ఎంటర్‌టైనర్. కామెడీ, రొమాన్స్, ఎమోషన్ మిక్స్ చేస్తూ చిన్నపాటి సందేశాన్ని కూడా అందించారు. భరణి లాంటి వ్యక్తి ద్వారా దానిని చెప్పించడం బాగుంది. అయితే ఆరంభంలో వచ్చే కొన్ని సన్నివేశాలు, ద్వితీయార్ధంలో కొన్ని కీలక సన్నివేశాలు స్లోగా సాగాయి. శ్రీవిష్ణు నటన, మేఘా ఆకాష్ గ్లామర్, సునైనా స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి ప్లస్ అవుతాయి. దర్శకుడు స్క్రీన్ ప్లే ని ఇంకొంచెం పకడ్బందీగా రాసుకుని ఉంటే ఇంకా మంచి సినిమా అయి ఉండేది. ఏది ఏమైనా వారాంతంలో వినోదాన్ని కోరుకునే ప్రేక్షకులు కుటుంబ సమేతంగా ‘రాజ రాజ చోర’ను చూడొచ్చు.
ప్లస్ పాయింట్స్:
మైనస్ పాయింట్లు:
ట్యాగ్ లైన్: మనసుల్ని దోచిన ‘రాజ రాజ చోర’
రేటింగ్: 2.75/5