మలయాళ చిత్రాలు ఇప్పుడు తెలుగులో ఎక్కువగా రీమేక్ అవుతున్నాయి. అంతే కాదు… కరోనా కారణంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పుంజుకోవడంతో పలు చిత్రాలు డబ్బింగ్ కూడా అవుతున్నాయి. మొన్నటి వరకూ మలయాళ అనువాద చిత్రాలంటే మోహన్ లాల్, మమ్ముట్టి, సురేశ్ గోపీవే! కానీ ఇప్పుడు పృధ్విరాజ్, దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాజిల్ చిత్రాలూ ఓటీటీలో వస్తున్నాయి. అలానే ‘వైరస్, లుకా, ఫోరెన్సిక్, కాలా’ వంటి అనువాద చిత్రాలతో తెలుగువారికి చేరవయ్యాడు మరో మలయాళ నటుడు టివినో థామస్. అతను నటించిన సూపర్ హీరో మూవీ ‘మిన్నల్ మురళి’ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు వర్షన్ సైతం అందుబాటులో ఉంది.
జేసన్ (టివినో థామస్) తండ్రి ఓ రంగస్థల కళాకారుడు. ఓ నాటక ప్రదర్శన సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో అతను మరణిస్తాడు. దాంతో పిల్లాడిగా ఉన్న జేసన్ ను వర్కి (పి. బాలచంద్రన్) పెంచి పెద్ద చేస్తాడు. టైలర్ అయిన జేసన్ కు ఎలాగైనా విదేశాలకు వెళ్ళి బాగా డబ్బులు సంపాదించాలన్నది కోరిక. ఎస్.ఐ. సాజన్ (బైజూ సంతోష్) కూతురు బిన్సీ (స్నేహబాబు)ని అతను ప్రేమిస్తాడు. అయితే అప్పటికే జీవితంలో స్థిరపడిన అనీష్ (జుడే ఆంథోనీ జోసెఫ్)కు ఇచ్చి సాజన్ తన కూతురు పెళ్ళిచేస్తాడు. అనీష్ ప్రియరాలైన బ్రూస్ లీ బిజీ (ఫెమినా జార్జ్) దాంతో హర్ట్ అవుతుంది. విఫలమైన ప్రేమలోంచి బయటపడి ఇటు జేసన్, అటు బిజీ ఒకరికి ఒకరు దగ్గరవుతారు. సరిగ్గా ఇదే సమయంలో క్రిస్మస్ వేడుకలు ఊరిలో జరుగుతుండగా, జేసన్ మెరుపుదాడికి గురవుతాడు. అంతే కాదు… అదే మెరుపు ఆ వూరిలోని శిబు (గురు సోమసుందరం)ను సైతం తాకుతుంది. వీరిద్దరికీ బోలెడంత శక్తి వచ్చేస్తుంది. ‘మిన్నల్ మురళి’ అనే పేరుతో జేసన్ ఊరికి మంచి చేయాలని చూస్తే, తన ప్రేమ విఫలమైందన్న కసితో శిబు రగిలిపోతూ, ఊరిని నాశనం చేయాలనుకుంటాడు. మంచికి, చెడుకు మధ్య జరిగే పోరాటంలో ఎవరు విజయం సాధించారన్నదే ఈ చిత్ర కథ.
సూపర్ హీరో సినిమా అనగానే మనకు ఠక్కున సూపర్ మ్యాన్ , స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ వంటి వారు గుర్తొస్తారు. ఈ కాన్సెప్ట్ తోనే కొన్ని భారతీయ చిత్రాలు వచ్చినా, అవి పెద్దంత విజయం సాధించలేదు. ఆ సూపర్ హీరోస్ కు నేటివిటీని అద్ది జనం మీద రుద్దాలనే ప్రయత్నం కొంతకాలంగా భారతీయ భాషా చిత్రాలలో జరుగుతోంది. అందులో ‘క్రిష్’ సీరిస్ ఓ స్థాయిలో విజయవంతమైంది. దక్షిణాదిలోనూ సూపర్ హీరో మూవీస్ కొన్ని వచ్చాయి. ఇప్పుడు మలయాళంలోనూ టివినో ధామస్ కోసం అరుణ్ అనిరుధ్, జస్టిన్ మాథ్యూ అలాంటి ఓ కథను రాశారు. దానికి కేరళ నేటివిటీని బాగా దట్టించారు.
సమాజంలోని చెడును తొలగించడమే కాకుండా, తనలాంటి సూపర్ పవర్స్ ఉన్న వ్యక్తిని ఇందులో హీరో ఎలా ఎదుర్కొన్నాడన్నది చూపించారు. అయితే అవతల విలన్ గా నటించిన శిబును చివరి వరకూ పాజిటివ్ గానే దర్శకుడు బాసిల్ జోసెఫ్ చూపించాడు. ఊరంతా పిచ్చివాడిగా భావించే శిబు గతం గురించి తెలిసిన వారికి, ఆ పాత్ర మీద జాలి కలుగుతుంది తప్పితే కోపం రాదు. అతను ఒకానొక సమయంలో ఊరిని వల్లకాడు చేయాలని చూసినా… అతనిపై తీవ్రస్థాయిలో ద్వేషం కలగదు. ఈ సినిమాలో ప్రధాన లోపం ప్రతినాయకుడి పట్ల దర్శకుడు చూపిన జాలి, దయ! దాంతో క్లయిమాక్స్ ఆశించిన స్థాయిలో పండలేదు. పైగా ప్రథమార్ధం కూడా సాగతీతలా ఉండటంతో వీక్షకులు అసహనానికి గురౌతారు. సూపర్ హీరో కాన్సెప్ట్ ను తీసుకుని ఏదో కొత్తగా ట్రై చేయాలని దర్శకుడు ప్రయత్నించాడు కానీ అది సఫలీకృతం కాలేదు.
వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకోవడంలో ముందుండే టివినో థామస్ ఇందులో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. అయితే ఒక పాత్ర తర్వాతే మరో పాత్ర ఇందులో వస్తుంది. ఆ రెండు పాత్రలను చాలా సమర్థవంతంగా టివినో పోషించాడు. ఇక శిబు పాత్రలో గురు సోమసుందరం చక్కగా ఒదిగిపోయాడు. ఒకరకంగా టివినో కంటే ఈ పాత్రకే యాక్టింగ్ లో ఎక్కువ స్కోప్ ఉంది. ఇతని ప్రియురాలు ఉషగా షెల్లీ కిశోర్, బ్లూస్ లీ బిజీగా ఫెమినా జార్జ్ చక్కగా నటించారు. అనీశ్ గా జుడే ఆంథోని జోసెఫ్ కాస్తంత నవ్వించే ప్రయత్నం చేశాడు. టివినో బావగా, పోలీస్ అధికారిగా అజు వర్గీస్, అతని పెంపుడు తండ్రిగా బాలచంద్రన్ గా చక్కగా చేశారు. నటీనటులంతా సహజ నటన ప్రదర్శించారు. సమీర్ తాహిర్ సినిమాటోగ్రఫీ; సుశీన్ శ్యామ్, షాన్ రెహమాన్ సంగీతం బాగున్నాయి. లివింగ్ స్టోన్ మాథ్యూ ఇంకాస్తంత షార్ప్‌గా ఎడిటింగ్ చేసి ఉండాల్సింది. మొత్తంగా చూస్తే ‘మిన్నల్ మురళి’ ఫర్వాలేదనిపిస్తుంది. ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతోంది కాబట్టి తీరిక సమయాల్లో ఓసారి చూడొచ్చు!
ప్లస్ పాయింట్స్
సూపర్ హీరో మూవీ కావడం
నటీనటుల సహజ నటన
సాంకేతిక నిపుణుల పనితనం
మైనెస్ పాయింట్
ఆకట్టుకోని కథనం
ఊహకందే ముగింపు
రేటింగ్: 2.5 / 5
ట్యాగ్ లైన్: లోకల్ సూపర్ హీరో!