నటీనటులు : సూర్య, ప్రియాంక అరుల్ మోహన్, వినయ్ రాయ్, సత్యరాజ్, రాజ్ కిరణ్, జయప్రకాశ్, మధుసూదనరావు, హరీశ్ పరేడి, శరణ్య, దేవదర్శిని, ఎమ్మెస్ భాస్కర్, సూరి, రెడిన్ కింగ్స్లే, శరణ్ శక్తి
సినిమాటోగ్రఫి : ఆర్.రత్నవేలు
సంగీతం : డి.ఇమ్మాన్
సమర్పణ : కళానిధి మారన్
నిర్మాణం : సన్ పిక్చర్స్
కథ, దర్శకత్వం : పాండిరాజ్
సూర్య ‘ఈటి’కి ముందు నటించిన ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ రెండు చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాయి. రెండేళ్ళ తరువాత సూర్య నటించిన ఓ చిత్రం థియేటర్లలో విడుదల కావడం ఇదే మొదటి సారి. తమిళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లోనూ అనువాదమై ‘పాన్ ఇండియా మూవీ’గా జనం ముందు నిలచింది. దాంతో సూర్య అభిమానుల్లోనూ, ఇతర సినీఫ్యాన్స్ లోనూ ‘ఈటి’పై ఆసక్తి నెలకొంది.
కృష్ణమోహన్ (సూర్య) లాయర్. భార్య ఆధిర (ప్రియాంక అరుల్ మోహన్) తో పాటు తల్లిదండ్రులు (శరణ్య, సత్యరాజ్)తో హ్యాపీగా జీవితాన్ని గడుపుతుంటాడు. అయితే ఒక రోజు ఉత్తమ ఉపాధ్యాయుడు, పోలీస్ ఆఫీసర్ తో పాటు మరో ఐదుగురుని అతను హత్య చేస్తాడు. చిత్రం ఏమంటే దానికి కొద్ది రోజుల ముందే ఈ లాయర్ జైలు శిక్ష అనుభవించి వస్తాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళుతుంటే… తల్లి అడ్డం పడి ‘నా చేతుల మీద పెరిగిన నువ్వా ఈ హత్యలు చేసింది?’ అంటూ కన్నీరు పెడుతుంటే… ‘హత్యలు చేయలేదు కలుపు తీసేశాను’ అని సమాధానం చెబుతాడు. కృష్ణ మోహన్ నిజంగానే ఆ హత్యలు చేశాడా? అందుకు పురి కొల్పిన పరిస్థితులు ఏమిటీ? అనేదే ‘ఈటి’ సినిమా.
అమ్మాయిలను ప్రేమ పేరుతో చేరదీసి, దగా చేయడం కొందరు ప్రబుద్ధుల పని. మరికొందరు రాక్షసులైతే వారికి శారీరకంగా దగ్గరై తెలియకుండా వీడియోలూ తీసి మోసం చేస్తుంటారు. అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి రకరకాలుగా వాడుకుంటారు. అలా ఒక ఊరి అమ్మాయిలను టార్గెట్ చేసే కేంద్ర మంత్రి కొడుకు కామేశ్ (వినయ్ రాయ్), అతని టీమ్ కు హీరో ఎలా బుద్ధి చెప్పాడన్నదే ఈ చిత్ర కథ. నిజానికి ఇదో సీరియస్ సబ్జెక్ట్. సహజంగా మోసపోయిన అమ్మాయిలు తమకు జరిగిన అన్యాయాన్ని మనసులో దాచుకుని కుమిలిపోతారు తప్పితే, బయటకు చెప్పుకోలేరు. పోలీసులనూ ఆశ్రయించరు. కొన్ని బలహీన క్షణాలలో తీసుకున్న నిర్ణయం వారి కుటుంబం మొత్తాన్ని దహించివేసే ఆస్కారం కూడా ఉంటుంది. అలాంటి కొన్ని సంఘటనలు హీరో దృష్టికి వచ్చినప్పుడు అతను మొదట కోర్టును ఆశ్రయిస్తాడు. న్యాయవాది అయిన అతనికి కూడా అక్కడ అన్యాయమే జరగడంతో చివరికి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాడు. దుష్ట శిక్షణ చేసి… తన పేరును సార్థకం చేసుకుంటాడు.
ఓ సున్నితమైన అంశాన్ని సూటిగా చెప్పుకుండా దర్శకుడు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దీనిని మలచాలని ప్రయత్నించాడు. హీరో చిన్నప్పుడే అతని కుటుంబంలో జరిగిన ఓ అన్యాయాన్ని లీడ్ గా తీసుకుని, ఏ అమ్మాయికి అన్యాయం జరిగిన ఆ ఫ్యామిలీకి బాసటగా నిలిచే మనస్తత్త్వం ఉన్నట్టు చూపించాడు. ఇక రెండు గ్రామాల మధ్య సమస్యను సృష్టించడం, రెండేళ్ళ పాటు ఆ గ్రామాల మధ్య ఆడపిల్లలను ఇచ్చిపుచ్చు కోవడాలు లేకపోవడం, హీరో – హీరోయిన్ల ప్రేమ, పెళ్ళి తంతు, ఆ తర్వాత అత్తగారు, కొత్త కోడలు మధ్య సరదా సన్నివేశాలు… ఇవన్నీ దర్శకుడు చెప్పాలనుకున్న సమస్యను చాలా డైల్యూట్ చేసేశాయి. ఓ పక్క అమ్మాయిల జీవితాలు ఏమైపోతాయో, దీనికి పరిష్కారం ఎలా చూపుతారో అని థియేటర్లో జనం చూస్తుంటే.. హీరోతో రకరకాల వేషాలు వేయించి పాటలు పెట్టడం, కథ సీరియస్ గా సాగుతుండగానే మధ్యలో కామెడీని చొప్పించడం… ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేదే. ఓ సీరియస్ అంశానికి ఇలా బాధ్యత లేకుండా చూపుతున్నారేమిటనే చికాకూ కలుగుతుంది. పోనీ… అవతలి వ్యక్తి కి ఏదైనా పిన్ పాయింట్ టార్గెట్ ఉందా అంటే అదీ లేదు. సమాజంలో కొన్ని ఘోరాలు పక్కా ప్లానింగ్ తో జరుగుతున్నాయని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని చెప్పే క్రమంలో దర్శకుడు పాండిరాజ్ విపరీతంగా తడబడ్డాడు. దాని ఫలితంగా ఎటో వెళ్ళాల్సిన కథ… ఎటో వెళ్ళినట్టు అయ్యింది.
నటీనటుల విషయానికి వస్తే… సూర్య తన పాత్రలోకి ఇట్టే పరకాయ ప్రవేశం చేశారని చెప్పాలి. హీరో తండ్రిగా సత్యరాజ్ తన పరిధి మేరకు చక్కగా అభినయించారు. ఇక తల్లిగా శరణ్య బోలెడంత వినోదాన్ని అందించే ప్రయత్నం చేసింది. అలానే హీరోయిన్ ప్రియాంక మోహన్ అందాల బొమ్మలాగే కనిపించింది. అయితే ఇందులో కాసింత అభినయాన్నీ ప్రదర్శించింది. తెలుగు ‘వాన’ ఫేమ్ వినయ్ విలనిజాన్ని బాగానే పండించాడు. మధుసూదనరావ్, జయప్రకాశ్, హరీశ్ పరేడి వంటి నటులను పాండిరాజ్ సరిగా ఉపయోగించు కోలేకపోయాడు. ఇమ్మాన్ నేపథ్య సంగీతం కథకు తగ్గట్టుగా సాగింది. పాటలు ఏమంత గొప్పగా లేవు. రత్నవేలు కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది.
ఓ చిన్న పాయింట్ ను తీసుకుని, దానికి రకరకాల హంగులు అద్దే ప్రయత్నం చేశారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవాలనే తాపత్రయంతో అవసరానికి మించిన అతి చేశారు. చివరకు అది అటూ కాకుండా, ఇటూ కాకుండా అయిపోయింది. ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ లాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ లో చేసిన సూర్యను తిరిగి ఇలాంటి పాత్రలో చూడం కాస్తంత కష్టమే! పైగా ఎంచుకున్న అంశానికి, దానికి చుట్టూ అల్లిన కథకు పొంతన లేకుండా ఉంది.
రేటింగ్: 2.25 /5
ప్లస్ పాయింట్స్:
ఎంచుకున్న పాయింట్
సూర్య నటన
పాండిరాజ్ దర్శకత్వం
మైనస్ పాయింట్స్:
ఆకట్టుకోని స్క్రీన్ ప్లే
మెప్పించని కామెడీ
నిరాశపరిచే సంగీతం
ట్యాగ్ లైన్ : ఎవరికీ తలకెక్కదు!