సినిమా నిర్మాణమంటే కోట్లతో కూడిన వ్యవహారం. అందువల్ల పెట్టిన పెట్టుబడి తిరిగి రావడం కోసం ఎలాంటి కమర్షియల్ హంగులు జోడించాలా అని నిర్మాతలు ఆలోచిస్తుంటారు. అయితే అదే సినిమా ద్వారా సమాజానికి ఏదైనా ఓ మంచి చెప్పాలని తాపత్రయపడే దర్శక నిర్మాతలూ కొందరుంటారు. మనసులో మెదిలిన భావాలను పదిమందికి అందించడమే వారి లక్ష్యంగా ఉంటుంది. అలా నిజాయితీతో చేసిన ప్రయత్నాలు ఎంతవరకూ ప్రేక్షకులను మెప్పిస్తాయనేది పక్కన పెడితే, మేకర్స్ కు ఓ తృప్తి అయితే ఖచ్చితంగా లభిస్తుంది. అలాంటి పీరియాడిక్ మూవీనే ‘1997’.
ఊరిలోని దొర (రామరాజు) గారికి వంశపారంపర్యంగా వస్తున్న కులజాడ్యం బాగానే ఉంటుంది. గ్రామంలోని అట్టడుగు వర్గాలకు ఆలయ ప్రవేశానికి అవకాశం ఇవ్వడు కానీ తన కామదాహాన్ని చల్లార్చుకోవడానికి వారిని బాగానే ఉపయోగించుకుంటాడు. చిత్రం ఏమంటే ఆయన ప్రజాప్రతినిధి కూడా. దొరగారికి నక్సలైట్ల నుండి బెదిరింపులు ఉండటంతో ఆ ఊరికి ఏసీపీ విక్రమ్ రాథోడ్ ను (డా. మోహన్)ను పంపుతారు. అయితే ఛార్జ్ తీసుకున్న మర్నాడే గూడెంలో ఉండే గంగ, మంగ అనే అమ్మాయిలు తప్పిపోతారు. రెండు రోజులకు ఓ అమ్మాయి అత్యాచారానికి గురై, చెరువులో శవమై తేలుతుంది. మరో అమ్మాయి ఏమైంది? వాళ్ళను కిడ్నాప్ చేసింది ఎవరు? ఇందులో దొర హస్తం ఉందా? దొరను హత్య చేయాలనుకున్న నక్సలైట్లు ఆ పని చేశారా? కొత్తగా వచ్చిన ఏసీపీ గూడెం వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడా? అనేది మిగతా కథ.
దాదాపు పాతికేళ్ళ క్రితం జరిగిన కథగా దీన్ని దర్శకుడు మోహన్ చూపించాడు. అప్పటికీ ఇప్పటికీ అంటరాని తనం అనేది బాహాటంగా బయటకు కనిపించకపోయినా అగ్రవర్ణాల వ్యక్తుల మనసు లోతుల్లో బాగానే తిష్ఠవేసుకుని ఉంది. సమయం వచ్చినప్పుడు అది బయటపడుతూ ఉంటుంది. ఇందులో దర్శకుడు కొన్ని అంశాల గురించి తన మనసులో భావాలను చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశాడు. అంటరాని వారంటూ దూరంగా పెట్టే వ్యక్తులను తమ కామదాహానికి ఉపయోగించుకునేప్పుడు అది ఎందుకు కనిపించదు? అంటే తమ అహంకారాన్ని ప్రదర్శించడానికి కులాన్ని అడ్డం పెట్టుకుంటారు తప్పితే మరొకటి కాదు. అలానే తప్పు అంటూ చేస్తే శిక్ష, కులం ఆధారంగా ఉండకూడదు. అట్టడుగు వర్గానికి చెందిన వారినైనా నిర్మొహమాటంగా శిక్షించాల్సిందే. ఆర్థికంగా ఎదిగినప్పుడే ఈ సమాజంలో వ్యక్తులకు గౌరవ మర్యాదలు దక్కుతాయి. అందుకోసం రిజర్వేషన్లు ఉపయోగపడతాయి. అదే సమయంలో అగ్రవర్ణాలలోని నిరుపేదలకూ రిజర్వేషన్లు వర్తింపచేయాలి. ఇలాంటి అంశాలను సూటిగానే చెప్పాడు. అయితే పోలీసులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం, నక్సలైట్ల సాయం తీసుకోవడం అనేవి సబబుగా అనిపించవు. నేటి సమాజంలో ప్రజాస్వామ్యమనేది మేడిపండు అని మెజారిటీ జనాలు అంగీకరించేదే అయినా, ఆ వ్యవస్థను బలోపేతం చేసే పంథాలో ఆలోచించినప్పుడు, ఆ తరహాలో ప్రజలను మేల్కొలిపినప్పుడే మాత్రమే ఉత్తమ సమాజం ఏర్పడే ఆస్కారం ఉంటుంది. క్షణికావేశంతో అధికారులు తీసుకునే నిర్ణయాలకు కూడా ఎక్కడో చోట చెక్ పాయింట్ అనేది ఉండాలి. చాలామంది దర్శకులు, రచయితలు టేక్ ఇట్ గ్రాంట్ అన్నట్టుగా దాన్ని విస్మరిస్తుంటారు. ఇది సమంజసం కాదు. గతంలో చాలా సినిమాలలో తప్పు చేసిన అధికారులకూ, ప్రజా ప్రతినిధులకు శిక్ష పడినట్టు చూపిస్తే కానీ ‘శుభం’ కార్డు పడేది కాదు. ఇప్పుడు రోజులు మారిపోయాయి. తమ భావాలను తెర మీదకు బట్వాడా చేశామా లేదా అనే దర్శకులు చూస్తున్నారు.
నటీనటుల విషయానికి వస్తే వృత్తిరీత్యా డాక్టర్ అయిన మోహన్ తొలిసారి తానే కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శక నిర్మాత బాధ్యతలను భుజానకెత్తుకున్నాడు. ఐపీఎస్ అధికారి విక్రమ్ రాథోడ్ గా బాగానే నటించాడు. ఇక సి.ఐ. చారి పాత్రలో ఎప్పటిలానే శ్రీకాంత్ అయ్యంగార్ స్టీల్ ది షో! విచారణాధికారిగా నవీన్ చంద్ర, దొరగా రామరాజు, ఎస్.ఐ. గా రవిప్రకాశ్ నటించారు. సంగీత దర్శకుడు కోటి ఈ సినిమాకు మ్యూజిక్ ఇవ్వడంతో పాటు డీజీపీగా స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చారు. ఆయన అందించిన నేపథ్య సంగీతం మూవీకి హైలైట్ గా నిలిచింది. ఇందులో ఒకే ఒక పాట ఉంది. అదీ నేపథ్య గీతం. ‘ఏమి బతుకులు.. ఏమి బతుకులు’ అంటూ సాగే ఈ గీతాన్ని మంగ్లీ పాడింది. యూట్యూబ్ లో విశేష ఆదరణ పొందిన ఈ లిరికల్ వీడియోను సినిమాలోనూ అలానే వాడేశారు. రోలింగ్ టైటిల్స్ లో మోహన్ తో కలిసి ఈ పాటను రాసిన ఆదేశ్ రవి వాయిస్ తో మరోసారి ప్లే చేశారు. చిట్టిబాబు కెమెరాపనితం ఓకే. పరిమితమైన బడ్జెట్ తో మీనాక్షి రమావత్ నిర్మించిన ఈ సినిమా కథాంశం గొప్పది. అయితే ఎక్కువమందిని ఆకట్టుకునే అంశాలు ఇందులో తక్కువ. ప్రథమార్థం సాదాసీదాగా సాగినా, ద్వితీయార్థం, ముఖ్యంగా ముగింపు థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న కథ
కోటి సంగీతం
పతాక సన్నివేశం
మైనెస్ పాయింట్స్
ప్రొడక్షన్ వాల్యూస్
నిదానంగా సాగే ప్రథమార్ధం
రేటింగ్: 2.5/ 5
ట్యాగ్ లైన్: వన్ మ్యాన్ షో!