వైసీపీలో ఆయనో కీలకనేత. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారపక్షంలో ఉన్నా తాను చెప్పాల్సింది కుండబద్ధలుకొట్టి మరీ చెప్పేస్తారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన చేసిన కామెంట్స్ ఆ కోవలోకే చేరాయి. మంత్రి పదవి రాలేదని అక్కసా? లేక తప్పొప్పులు చెప్పకొంటే తనకూ మిగిలినవాళ్లకూ తేడా ఏంటని అనుకుంటున్నారో.. మాటలతోనే మంటెక్కిస్తున్నారు. దీంతో అదేంటి అన్నాయ్.. ఆయన అలా అనేశారేంటి అని అంతా చర్చించుకుంటున్నారట.
స్వపక్షంలో విపక్షంగా మారిన తీరుపై చర్చ!
ధర్మాన ప్రసాదరావు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఈ మాజీ మంత్రి ఇటీవలకాలంలో ఏం మాట్లాడినా వైసీపీలో చర్చగా మారుతోంది. ఏడాది క్రితం YSR జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా విభజనపై తన గళం వినిపించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలు విభజిస్తే సిక్కోలుకు తీరని నష్టం వాటిల్లుతుందని ఓపెన్‌గానే చెప్పేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మానతో జిల్లా నేతలందరూ ఏకీభవించాల్సి వచ్చింది. అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా కూడా జరిగింది. స్వపక్షంలోనే విపక్షంగా మారిన మాజీ మంత్రి తీరు ప్రతిపక్షాలకు షాకిచ్చింది.
కేడర్‌లో అసంతృప్తి ఉందని ఓపెన్ కామెంట్!
కోవిడ్ సమయంలో కొన్నాళ్లు క్యాంప్ ఆఫీస్‌కే పరిమితమైన ప్రసాదరావు.. పంచాయితీ, స్థానిక సంస్థల ఎన్నికల వేళ మరో బాంబ్ పేల్చారు. ప్రభుత్వం ఏర్పడ్డాక పార్టీ కార్యకర్తల్లో నైరాశ్యం, అసంతృప్తి నెలకొన్నాయని ముఖ్యనేతల సమావేశంలో కుండబద్ధలు కొట్టేశారు. ఆ సమయంలోనూ ప్రసాదరావు వైఖరికి పార్టీ నేతలు ఆశ్చర్యపోయారట.
మార్కెట్ కమిటీ డైరెక్టర్ల పదవీకాలంపై అసహనం!
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రసాదరావు మార్కెట్ కమిటీల డైరెక్టర్ల పై చేసిన కామెంట్స్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. సిక్కోలు రైతాంగాన్ని ఆదుకునేందుకు నాడు రాజశేఖర్‌రెడ్డి.. నేడు ఆయన కుమారుడు సీఎం జగన్ కృషి చేస్తున్నారంటూనే.. మార్కెట్ కమిటీల డైరెక్టర్ల పదవీకాలంపై తన మనసులో మాటను బయటపెట్టేశారు. ప్రతినిధులు లేకుండా కమిటీలు దేనికి.. రెండు నెలలు ఒకరు.. ఆరు నెలలు ఇంకొకరు.. ఇదేం పద్ధతని అసహనం వ్యక్తం చేశారు. ప్రయోజనంలేని పదవులు దేనికి.. పూర్తికాలం పనిచేసేలా అవకాశం ఉంటే డైరెక్టర్లుగా ఉన్నవారు ఉత్సాహంగా పనిచేస్తారని స్పష్టం చేశారు.
అదేంటి అన్నాయ్..! పెద్దాయన అలా అనేశారు!!
ప్రసాదరావు చేసిన ఈ కామెంట్స్‌పైనే చర్చ జరుగుతోంది. కొందరేమో అదేంటి అన్నాయ్ పెద్దాయన అలా అనేశారు అని చెవులు కొరుక్కుంటున్నారట. మరికొందరు మాత్రం ధర్మాన ఏం మాట్లాడినా ఓ అర్ధం ఉంటుందిలే అని సరిపెట్టేసుకుంటున్నారట. ఏదేమైనా.. ధర్మాన అదునుచూసి చేస్తున్న కామెంట్స్‌తో ఇరకాటంలో పడుతున్నామని కొందరు నాయకులు అనుకుంటున్నారు. మరి.. హైకమాండ్ ఏం చేస్తుందో? స్వపక్షంలో సరైన గొంతు అనుకుంటుందా.. లేక విపక్షంలా మాట్లాడుతున్నారు అని భావిస్తుందో చూడాలి.