Chairman’s Desk: హిందూ మతాన్ని అవలంబించేవాడు హిందువా..? తమ పూర్వీకులు హిందువులైనా.. హిందువేనా..? హిందూ సంస్కృతి సారాంశాన్ని గ్రహించినవాడు హిందువా..? కేవలం ఆలయాలను సందర్శించేవాడే హిందువా..? గుడికి వెళ్లకపోతే హిందువు కాదా..? ఇలా ఎవరు హిందువు అని చెప్పడానికి చాలా ప్రశ్నలకు జవాబులు వెతకాల్సి ఉంటుంది. కానీ దీనికి సమాధానం చాలా సంక్లిష్టమైనది. సర్వేజనా సుఖినోభవంతు అని సనాతన హిందూ ధర్మం ప్రబోధించింది. రామరాజ్యం కావాలనే మాట అన్ని పార్టీలూ వాడేదే. హిందూ మతానికి ఆది నుంచీ ఘనమైన చరిత్ర ఉంది.హిందూమతం అంటే అది మతం మాత్రమే కాదు. ఒక సంస్కృతి, ఒక చరిత్ర. ఘనమైన నాగరికత. సమున్నత వారసత్వ వైభవం. ఇలా భిన్నకోణాలున్నాయి.
దేశంలో హిందుత్వానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. రాముడు, కృష్ణుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ముక్కోటి దేవతలు ఎప్పట్నుంచో ఉన్నారు. వీరెవ్వరినీ ఎవరో వచ్చి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో హిందుత్వకు కొత్త నిర్వచనాలు ఇస్తున్న పార్టీలు పుట్టకముందు నుంచీ ప్రజలు హిందూమతం పాటిస్తున్నారు. దేశంలో గ్రామగ్రామాన రామాలయాలున్నాయి. ప్రతి గ్రామంలో రామాలయం వీధి ఉంటుంది. కాబట్టి హిందూమతం రక్షణ కోసమే, హిందువుల రక్షమ కోసమో రాజకీయాలతో పనిలేదని ఎప్పుడో తేలిపోయిన సత్యం. కొన్ని వేల సంవత్సరాలుగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కుని, విదేశీ దండయాత్రలను, బలవంతపు మతమార్పిడులను కాచుకుని, కాలానుగుణంగా తనను తాను సంస్కరించు కుంటూ వచ్చింది హిందూమతం. గతంలో ఎవరూ హిందూ మతాన్ని వాడుకోవాలనే ప్రయత్నం చేయలేదు. ఈ దేశ ప్రజలు ఆ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు కూడా కొన్ని పార్టీలు చేస్తున్న హిందుత్వ వాదనకు.. హిందువులందరూ మద్దతివ్వడం లేదు. ఆ సంగతి తెలిసినా కూడా.. హిందువులంతా ఓ పార్టీకే ఓటేయాలనడం.. అలా చేస్తేనే హిందూమతానికి రక్షణ ఉంటుందని చెప్పడం సరైన విధానం కాదు.
హిందువులందరూ ఓ పార్టీలో భాగం కాదు. అలాగే హిందువులందరూ ఓ పార్టీకి ఓటేయాల్సిన అవసరమూ లేదు. అలాగే ఏ పార్టీ కూడా కేవలం హిందువుల పార్టీ మాత్రమే కాదు. అలాగే హిందువులందరూ కచ్చితంగా ఓ పార్టీని, ఓ విధానాన్ని అనుసరించాల్సిన పరిస్థితి ఏం లేదు. దేశంలో ఎప్పట్నుంచో హిందువులు తమ వ్యక్తిగత ధర్మంతో సంబంధం లేకుండా సామాజిక, దేశ, ఆర్థిక అవసరాలన్ని దృష్టిలో పెట్టుకుని వేర్వేరు పార్టీలకు మద్దతిస్తున్నారు. అసలు ఓ ఎన్నికకు ఓ పార్టీకి ఓటేసిన వారు.. మరో ఎన్నికలో అదే పార్టీకి ఓటేస్తారనే గ్యారంటీయే లేని రోజుల్లో.. మతానికి, పార్టీలకూ ముడిపెట్టడం కుదిరేపని కాదు. అది సరైన పని కూడా కాదు.
హిందూమతం, దేశభక్తిలో దేశంలో అందరికీ వాటా ఉంది. ఇవి ఏ కొందరికో పరిమితం కాదు. అలా చేయడం కూడా ప్రాక్టికల్ గా కుదరదు. అంతేకానీ ఓ పార్టీకి ఓటేస్తేనే హిందువులని, దేశభక్తులని ప్రచారం చేయడం అపరిపక్వతే తప్ప మరొకటి కాదు. దేశంలో ప్రజలకు ఉన్న పరిణతిని తక్కువ అంచనా వేయకూడదు. ఎక్కడ మతం వస్తుందో.. ఎక్కడ రాజకీయం చేస్తారో.. రెండింటికీ ఎక్కడ సరిహద్దు ఉంటుందో వారికి బాగా తెలుసు. అందుకే హిందూమతం గురించి ఎంత చర్చ జరిగినా.. ఎన్ని కొత్త నిర్వచాలు.. ప్రజలు మాత్రం సనాతన ధర్మాన్ని తమ పెద్దలు చెప్పిన పద్ధతుల్లో పాటిస్తూ వస్తున్నారు. అంతేకానీ ఎక్కడా అయోమయానికి గురవడం లేదు. ఎవరేమనుకున్నా.. తమ పని తాము చేసుకుపోతున్నారు. అయినా సరే ఏదో రకంగా జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వీటిని ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
సనాతన ధర్మంలో రామరాజ్యం అంటే ప్రజలు సుఖసంతోషాలతో ఉండే రాజ్యమని అర్థం. ఈ రాజ్యం ఎవరు తెస్తామన్నా ఓకే. అంతే కానీ ఆ పేరుతో రాజకీయం చేయటానికి, రాముడిపై ఓ పార్టీకే పూర్తి హక్కులు ఉన్నాయనటానికి ఎవరూ ఒప్పుకోరు. ఏ దేవుడ్ని అయినా ఆదర్శంగా తీసుకోవటానికి, ఆ దేవుడు మా వాడే అనటానికీ చాలా తేడా ఉంది. వేల సంవత్సరాలుగా ఉన్న హిందూమతానికి, దాన్ని అనుసరించే ప్రజలకు ఈ తేడా చాలా బాగా తెలుసు. అందుకే వారు చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నారు. తమను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నాలకు పెద్దగా స్పందించడం లేదు.
హిందుత్వంలో చాలా సిద్ధాంతాలున్నాయి. కానీ అన్నింటి సారం ఒక్కటే. ఎంతమంది దేవుళ్లున్నా.. పరమాత్మ ఒక్కడే అనే మూలసూత్రం కూడా కనిపిస్తుంది. ఇలా ఈ దేశానికి పునాది అయిన భిన్నత్వంలో ఏకత్వాన్ని.. సనాతన ధర్మం వేల ఏళ్ల క్రితమే ఆచార వ్యవహారాల రూపంలో ఆవిష్కరించింది. అందుకే హిందూమతాన్ని భారత్ ఆత్మగా చెబుతారు. అలాగే నిజమైన హిందువు ఎవరూ ఇతరుల్ని ద్వేషించకూడదనే సూత్రం కూడా ఉంది. అసలు హిందూమతానికి ఏదో జరుగుతుందనే అభద్రతాభావనకు ఆ మతం మొదట్నుంచీ వ్యతిరేకం. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండటమే హిందుత్వ చెప్పే సూత్రం. అందుకే అసలైన హిందువులెవరూ చిన్నపాటి విషయాలకు స్పందించబోరని చెబుతారు. దేశవ్యాప్తంగా ఉన్న స్వామీజీలు, మఠాలు బోధించేది కూడా అదే. వ్యక్తిగతంగా ఎవరి ధర్మం వారు పాటించడానికి.. ఇతరులతో పోటీ పెట్టుకోవాల్సిన పని లేదనేది దాని సారాంశం. ఈ సూక్ష్మం హిందూమతాన్ని పాటించే మెజార్టీ ప్రజలకు తెలుసు కాబట్టే.. వారు రాజకీయాలకు అతీతంగా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు. పైగా మతం పేరు చెప్పుకుని సామాజికంగా ఏదో చేయటానికి కూడా వారు పెద్దగా ఇష్టపడరు. అందుకే వ్యక్తిగత విశ్వాసమైన మతాన్ని, సామాజిక, దేశ, ఆర్థిక అవసరాల పర్యవసానమైన రాజకీయంతో ఎప్పుడూ ముడిపెట్టరు. అసలు ఆ ఆలోచన కూడా రానీయరు.
హిందువులను డైవర్ట్ చేయటానికి చరిత్రలో కొన్ని ప్రయత్నాలు జరిగినా అవి విఫలమయ్యాయి. అలాగే హిందూ మతం కూడా ఎప్పటికప్పుడు మార్పును స్వీకరిస్తూనే వచ్చింది. ఇప్పుడెవరో కొత్తగా వచ్చి హిందుత్వ గురించి హిందువులకు చెప్పాల్సిన పనేం లేదు. దేశంలో హిందూమతానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదనేది మెజార్టీ హిందువుల భావన. ఏ మతమైనా కొందరు వ్యక్తుల కృషితో నిలబడదు. కోట్ల మంది ప్రజల సంఘటిత శక్తితోనే నిలుస్తుంది. ఈ సత్యం హిందూమతం విషయంలో ఇప్పటికే నిరూపితమైంది. ఇప్పుడు కొత్త నిర్వచనాలు, సరికొత్త నిరూపణలు అవసరమే లేదు. హిందూమతం అంటే ఏంటో హిందువులకే చెప్పడం.. తాతకు దగ్గులు నేర్పడం లాంటిదే. తరతరాలుగా హిందూమతాన్ని పాటిస్తూ.. సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నవారికి.. వారి మతాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియదనుకోలేం. అందుకోసం కొత్తగా ఎవరో వచ్చి సలహాలివ్వాల్సిన అక్కర లేదు. అదీ కాకుండా అనవసరంగా లేనిపోని ప్రచారాలతో హిందూమతం చుట్టూ అపోహలు సృష్టించే ప్రయత్నం కూడా మంచిది కాదు. హైందవం పైకి సంక్లిష్టంగా కనిపిస్తున్నా.. కాస్త లోతుకు వెళ్లి చూస్తే సరళమైనదే. దేశంలో మెజార్టీ హిందువులకు ఆ మర్మం తెలుసు. తాము హిందువులమని చెప్పుకుంటూ కొందరు వివిధ కాలాల్లో చేసిన పనులేంటో కూడా బాగా తెలుసు. అందుకే ఇప్పుడు హిందువుల ముందు సనానత ధర్మ పరిరక్షకులుగా చెప్పుకోవడమంటే.. హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టే అవుతుంది.