కుటుంబ ఖర్చులు పెరుగుతున్న తరుణంలో భార్యాభర్తలిద్దరు జాబ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే కొంత మంది గృహిణులు ఏదైనా జాబ్ ఉంటే బాగున్ను అని ఆలోచిస్తుంటారు. నెల నెల కొంత ఆదాయాన్ని పొందాలని చూస్తుంటారు. ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చే విధంగా వినూత్న పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం పేరు “బీమా సఖి”. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హరియాణాలోని పానిపత్‌లో 09 డిసెంబర్ 2024 బీమా సఖి యోజనను ప్రారంభించారు. టెన్త్ పాసైన మహిళలకు ఈ పథకం వరం అని చెప్పొచ్చు. ఇంటి వద్దే ఉంటూ వేలల్లో ఆదాయాన్ని పొందొచ్చు.
ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల మహిళలకు ప్రయోజనం కలుగుతుంది. బీమా సఖీ యోజనలో భాగంగా మహిళలకు బీమా రంగంలో శిక్షణ ఇస్తారు. ఈ పథకం ద్వారా, మహిళలు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో బీమా సఖిగా నియమితులవుతారు. అనగా వారిని LIC ఏజెంట్లుగా నియమించుకుంటారు. ఏజెంట్స్ గా మారిన మహిళలు ప్రజలకు బీమా చేయగలరు. ఈ పథకంలో ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలవారీగా స్టైఫండ్ లభిస్తుంది. ఈ పథకంలో చేరిన బీమా సఖులకు పథకం కింద ప్రతి నెలా రూ. 7,000 నుంచి రూ. 21,000 వరకు అందజేస్తారు. పథకం ప్రారంభంలో ఒక్కో మహిళకు ప్రతి నెలా రూ. 7,000 ఇస్తారు. రెండో సంవత్సరంలో నెలకు 6 వేలు అందిస్తారు. మూడో సంవత్సరంలో నెలకు రూ. 5 వేలు వస్తుంది.
అంతేకాదు, బీమా లక్ష్యాలను పూర్తి చేసిన మహిళలకు ప్రత్యేక కమీషన్ కూడా చేతికి వస్తుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త పథకం గ్రామీణ మహిళలు స్వయం సమృద్ధి సాధించడానికి ఉపయోగపడుతుంది. ఈ పథకానికి అర్హులు ఎవరంటే.. పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళలు అర్హులు. మహిళల వయస్సు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలోని ఎల్‌ఐసీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు లేదా ఆన్‌లైన్‌లో www.licindia.in ను సందర్శించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. కేంద్రం తెచ్చిన బీమా సఖి యోజన పథకంతో మహిళలు ప్రతి నెల ఆదాయం పొందొచ్చు.