చైనా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివో మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. వివో కంపెనీ రూ.62,476 కోట్ల మేర ఇంకమ్ ట్యాక్స్ చెల్లించకుండా ఆ మొత్తం డబ్బులను చైనాకు తరలించిందని ఈడీ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఇండియాలోని 23 రాష్ట్రాల్లో 48 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ నటించిన ప్రకటనలు టెలీకాస్ట్‌కు సిద్ధంగా ఉండగా వాటిని తాజాగా వివో యాజమాన్యం నిలిపివేసింది. అయితే ఇది తాత్కాలిక నిషేధమేనని తెలియజేసింది. ఇప్పుడున్న సమస్యలు పరిష్కారం అయిన తర్వాత సదరు ప్రకటనలను టీవీలు, సోషల్ మీడియా ప్లా్‌ట్‌ఫారాలలో ప్రసారం చేస్తామని వివో పేర్కొంది.
Read Also: Tata Motors: పెరుగనున్న టాటా కార్ల ధరలు
గత ఏడాది ఏప్రిల్‌లో వివోతో విరాట్ కోహ్లీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు ఆ కంపెనీ ప్రకటనలలో విరాట్ కోహ్లీ నటిస్తున్నాడు. అయితే ఇండియాలో వివో స్మార్ట్ ఫోన్ విక్రయాలు 1,25,185 కోట్లు కాగా అందులో 62,476 కోట్లను ఆ కంపెనీ చైనాకు పంపించినట్లు ఈడీ అధికారులు నిర్ధారించారు. కాగా తాజా పరిస్థితుల దృష్ట్యా తాము తీసుకున్న నిర్ణయం విరాట్ కోహ్లీకి కూడా ఉపయోగపడుతుందని వివో యాజమాన్యం అభిప్రాయపడింది. ఒకవేళ సదరు ప్రకటనలు టెలీకాస్ట్ అయితే విరాట్ కోహ్లీపైనా విమర్శలు వచ్చే అవకాశం ఉందని. అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది.