అక్టోబర్ నుంచి ద్రవ్యోల్బణం తగ్గొచ్చు
అక్టోబర్ నుంచి ద్రవ్యోల్బణం తగ్గే అవకాశాలున్నాయని ఆర్బీఐ అంచనా వేస్తోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ధరల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండదేమోనని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. సరుకు రవాణా వ్యవస్థలో అవాంతరాల వల్ల నిత్యవసరాల ధరలు నింగినంటాయి. అయితే ఉక్రెయిన్‌పై నాలుగు నెలలుగా యుద్ధం చేస్తున్న రష్యా ఈమధ్య కొంచెం శాంతించటంతో ఉద్రిక్త వాతావరణం చల్లబడింది. దీంతో ఆర్బీఐ నుంచి సానుకూల అంచనాలు వెలువడుతున్నాయి.
ఎలాన్ మస్క్‌పై లీగల్ యాక్షన్
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌పై లీగల్ యాక్షన్‌కి ట్విట్టర్ రెడీ అవుతోంది. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని ఆయన అర్ధంతరంగా రద్దు చేసుకోవటం వల్లే ఈ చర్యకు దిగుతోంది. 44 బిలియన్ డాలర్ల విలువైన ఈ డీల్‌ని ఎలాన్ మస్క్ క్యాన్సిల్ చేసుకోవటంతో ట్విట్టర్ తీవ్రంగా నష్టపోనుందని నిపుణులు అంటున్నారు.
ఇండిగో టెక్నీషియన్ల మూకుమ్మడి సెలవు
వేతనాలను నామమాత్రంగా పెంచటంపై ఇండిగో టెక్నీషియన్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మూకుమ్మడిగా సిక్ లీవ్ పెట్టి ఎయిరిండియా ఇంటర్వ్యూకి వెళ్లారు. దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులకు అంతరాయం కలగటంతో ఈ విషయం బయటికొచ్చింది. ముఖ్యంగా ఢిల్లీ, హైదరాబాద్ వంటి మేజర్ హబ్‌లలో సిబ్బంది కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో ఇండిగో సంస్థ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. సిబ్బందితోపాటు పైలట్ల వేతనాన్ని తాజాగా 8 శాతం పెంచింది.
2 నెలల్లో సిడ్బి ఆన్‌లైన్ ప్లాట్ ఫాం
స్టార్టప్‌లను, ఇన్వెస్టర్లను ఒకే చోటకి తెచ్చేందుకు సిడ్బి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ని డెవలప్ చేస్తోంది. ఇది రెండు నెలల్లో రెడీ అవుతుందని సంస్థ ప్రతినిధి శృతి సింగ్ చెప్పారు. పోర్టల్ అందుబాటులోకి వస్తే స్టార్టప్‌లకు ఉపయోగం కలుగుతుందని అన్నారు. నిధుల కోసం ప్రత్యామ్నాయ పెట్టుబడుల వైపు చూడాల్సిన అవసరం ఉండబోదని తెలిపారు.
విమాన ఇంధనంపై ట్యాక్స్ తొలగింపు
విదేశాలకు సర్వీసులను నడిపే విమానయాన సంస్థలకు ఇంధనంపై పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో మన దేశ సంస్థలు కూడా అంతర్జాతీయ కంపెనీల సరసన చేరతాయి. అయితే.. దేశీయంగా రాకపోకలు సాగించే సంస్థలకు మాత్రం ఏటీఎఫ్‌పై 11 శాతం ఎక్సైజ్ పన్ను కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.
3 నెలల్లో దిగొచ్చిన ఉక్కు ధరలు
ఉక్కు ధరలు మూడు నెలల్లో 24 శాతం దిగొచ్చాయి. ఏప్రిల్ 6వ తేదీన 78 వేల రూపాయలుగా ఉన్న టన్ను స్టీల్ రేటు ఈ నెల 6వ తేదీన 59 వేల 8 వందలకు పడిపోయింది. ఈ ధరలు ఇంతకన్నా పడిపోయే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.