మంగళవారం భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ బుధవారం భారీ నష్టాల్లో కొనసాగుతోంది. డాలర్ స్థిరపడటంతో బంగారం ధరలు తగ్గాయి. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగా కొనసాగినా..పెట్టుబడి దారులు ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలపై వేచి చూసే ధోరణిలో ఉన్నారు. దీంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్‌లపై పడింది. డాలర్‌తో పోలిస్తే జపాన్ కరెన్సీ యెన్ విలువ 24 ఏళ్ల కనిష్ఠానికి చేరడం ఆసియా మార్కెట్లను కలవరపరుస్తోంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు సెంట్రల్ బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపుపై నిరంతర ఆందోళనల మధ్య ఆసియా షేర్లు ఈరోజు అస్థిరలో కొనసాగుతోన్నాయి. ఈ పరిణామాల మధ్య ఉదయం 10.10 గంటలకు బీఎస్ సెన్సెక్స్ 613 పాయింట్లు నష్టపోయి 51918 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 200 పాయింట్లు పతనమై 15,438 వద్ద కొనసాగుతోంది.
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.78.16 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో డాక్టర్ రెడ్డీస్, హెచ్‌యూఎల్, మారుతీ, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్ షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, టైటన్, టెక్ మహీంద్రా, రిలయన్స్ షేర్లు అత్యధికంగా నష్టపోతున్న వాటిలో ఉన్నాయి.