ఒకవైపు దేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంటే మరోవైపు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్‌బీఐ కోట్లాది మంది ఖాతాదారులకు షాకిచ్చింది. స్టేట్ బ్యాంక్ రుణ వడ్డీ రేట్లను (SBI MCLR పెంపు) 10 బేసిస్ పాయింట్లు లేదా 0.10 శాతం పెంచింది. ఈ మార్పు వివిధ పదవీకాల రుణాలపై ప్రభావం చూపుతుంది. ఇప్పటి నుంచి బ్యాంకు నుంచి రుణం తీసుకునేందుకు సామాన్యులు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ ఏడాది జూన్‌లో చివరిసారిగా ఎంసీఎల్ఆర్‌ను సవరించింది. ఇప్పుడు తాజాగా సవరించినట్లు పేర్కొంది.
READ MORE: Congress: ప్రధాని ‘‘కమ్యూనిల్ సివిల్ కోడ్’’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు..
మూడు సంవత్సరాల కాలానికి ఎస్‌బీఐ యొక్క కొత్త ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 9% నుంచి 9.10%కి పెరిగింది. అయితే ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 8.10% నుంచి 8.20%కి పెరిగింది. నెల, మూడు నెలల కాల వ్యవధులకు లెండింగ్ రేటు 8.45 శాతం నుంచి 8.5 శాతానికి చేరుకుంది. ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్ 8.85 శాతానికి, ఏడాది లెండింగ్ రేటు 8.85 నుంచి 8.95 శాతానికి పెంచింది. రెండేళ్ల ఎంసీఎల్‌ఆర్ 9.05 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్‌ఆర్ 9.1 శాతానికి పెంచుతున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది.
READ MORE: CM Chandrababu: టీడీపీ ఎప్పటికి గుడివాడకు రుణపడి ఉంటుంది..
అసలు ఎంసీఎల్ఆర్ అంటే ఏమిటి?
ఎంసీఎల్ఆర్ (Marginal Cost of Funds Based Lending Rate) అనేది రుణ రేటుని తెలుపుతుంది. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ రేటుకు రుణాలు ఇవ్వడానికి అనుమతి లేదు. కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ఇటీవల జరిగిన ద్వైమాసిక సమీక్షా సమావేశంలో రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచిన విషయం తెలిసిందే. దీంతో అధిక వడ్డీ రేట్ల నుంచి ఉపశమనం పొందాలనుకున్న రుణగ్రహీతలకు మరోసారి నిరాశే మిగిలింది. ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తేనే వడ్డీరేట్లు సవరించబడతాయి.