దేశంలో ఈ-వాహనాలు, ముఖ్యంగా ఈ-స్కూటర్ల పోరు మార్కెట్‌లో చాలా తీవ్రంగా మారింది. చాలా కంపెనీలు మార్కెట్లో ఉన్నాయి. పండుగల సీజన్‌లో విక్రయాలు పెంచుకునేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతున్నారు. అందుకే దేశంలోని అతిపెద్ద ప్యూర్-ప్లే ఈవీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ తన నెట్‌వర్క్ భాగస్వాముల సంఖ్యను పెంచుకోవాలని కొత్త ప్లాన్ వేసింది. కంపెనీ తమ విక్రయదారులను డీలర్లుగా కాకుండా నెట్‌వర్క్ భాగస్వాములుగా పిలుస్తుండటం గమనార్హం.
నెట్‌వర్క్ పార్టనర్స్ ప్రోగ్రామ్ ఉద్దేశ్యం ఏమిటి?
కంపెనీ ప్రకారం.. నెట్‌వర్క్ పార్టనర్స్ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం ఈవీ విప్లవాన్ని టైర్ 2 మరియు టైర్ 3 నగరాలకు విస్తరించడం. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఈవీల ప్రవేశం తగ్గింది. ఈ కార్యక్రమం కింద, కంపెనీ భారతదేశంలో తన విక్రయాల పాదముద్రను పెంచుకోవడానికి 625 మంది భాగస్వాములను చేర్చుకుంది. ఈ ఏడాది పండుగలకు ముందే భాగస్వామ్యుల సంఖ్యను 1000కు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది కాకుండా.. 2025 చివరి నాటికి కంపెనీ తన సేల్స్, సర్వీస్ నెట్‌వర్క్‌కు 10,000 మంది భాగస్వాములను చేర్చుకోవాలని యోచిస్తోంది.
ప్రస్తుతం విక్రేతల సంఖ్య?
ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం కంపెనీ యాజమాన్యంలో దాదాపు 800 స్టోర్లను కలిగి ఉంది. కంపెనీ నడుపుతున్న ‘నెట్‌వర్క్ పార్టనర్ ప్రోగ్రామ్’తో.. అమ్మకాలు మరియు సర్వీస్ టచ్ పాయింట్ల సంఖ్య దాదాపు 1800 వరకు పెరుగుతుంది. గత సెప్టెంబర్‌లో కంపెనీకి చెందిన స్కూటర్ల విక్రయాలు తగ్గుముఖం పట్టడం గమనార్హం. సెప్టెంబర్‌లో ఓలా 23,695 స్కూటర్లను మాత్రమే విక్రయించింది. ఇంతకుముందు ఈ-స్కూటర్ మార్కెట్‌లో 50 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. ఇప్పుడు దాదాపు 27 శాతానికి తగ్గింది.
గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకే ఈ పద్ధతి..
గ్రామీణ మార్కెట్‌కు చేరుకోవడానికి స్థిరమైన వ్యాపార వృద్ధిని తీసుకురావడంలో తమ డి2సి మోడల్ చాలా విజయవంతమైందని ఓలా ఎలక్ట్రిక్ సీఎండీ భవిష్ అగర్వాల్ చెప్పారు. ఇప్పుడు నెట్‌వర్క్ పార్టనర్ ప్రోగ్రామ్ వారి డి2సి నెట్‌వర్క్ ప్రయోజనాలను మరింత వేగంగా విస్తరిస్తుందని భవిష్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఇందులో భాగస్వాములు తక్కువ పెట్టుబడితో చాలా వేగంగా వృద్ధి చెందుతారని తెలిపారు. కంపెనీ యాజమాన్యంలోని స్టోర్‌లు కంపెనీ విక్రయాలు మరియు సేవా నెట్‌వర్క్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా, దేశంలోని పట్టణ, గ్రామీణ మార్కెట్‌లకు విస్తరించడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.