TCS: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. దీంతో చాలా ఐటీ కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని పిలుస్తున్నాయి. హైబ్రీడ్ మోడ్ లో ఉద్యోగాలు చేయాలని చెబుతున్నాయి. వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసులకు రావాలని ఉద్యోగులను కోరుతున్నాయి. ఇప్పటికే దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ తన ఉద్యోగులను ఆఫీసుకలు రమ్మని కోరింది. గూగుల్ వంటి సంస్థలు కూడా ఉద్యోగులు వారానికి మూడు రోజులు కార్యాలయానికి రావాలని కోరుతున్నాయి.
ఇదిలా ఉంటే వర్క్ ఫ్రం హోం పాలసీ కారణంగా టీసీఎస్ సంస్థలో మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టీసీఎస్ తన ఉద్యోగులను ఆఫీసకు రావాల్సిందిగా కోరింది. దీంతో చాలా మంది మహిళా ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని కోరుకోవడం, ఆఫీసులకు వెళ్లే ఉద్దేశం లేకపోవడంతో రాజీనామా చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 20 శాతానికి పైగా ఉద్యోగులు రాజీనామా చేశారు. వర్క్ ఫ్రం హోమ్ ని ఆపేయాలని కోరినందుకే మహిళా ఉద్యోగులు రాజీనామా చేస్తున్నారని టీసీఎస్ హెచ్ఆర్ చీఫ్ మిలింద్ లక్కడ్ కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడించారు.
మహిళా ఉద్యోగులు ఇంటి నుండి పని చేయాలనుకోవడం వల్ల ఎక్కువ మంది రాజీనామాలు చేశారని లక్కాడ్ నొక్కి చెప్పారు. ఇది కూడా ఒక కారణం కావచ్చని, వివక్షకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎంత మంది మహిళా ఉద్యోగులు కంపెనీని విడిచిపెట్టారనే దాని గురించి స్పష్టమైన సంఖ్యను టీసీఎస్ వెల్లడించలేదు. టీసీఎస్ లో మహిళా ఉద్యోగులు అట్రిషన్ రేట్ పురుషులతో సమానం లేదా కాస్త తక్కువగా ఉంది.
జెండర్ డైవర్సిటీని ప్రోత్సహించడంలో టీసీఎస్ ఎప్పుడూ వెనక్కి తగ్గదని, దీన్ని కంటిన్యూ చేస్తామని ఆ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం టీసీఎస్ లో 6 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో 35 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. నాలుగింట మూడోవంతు మహిళలు టాప్ పోజిషన్లలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. దాదాపుగా 20 శాతం అంటే లక్ష మంది ఉద్యోగులు ప్రస్తుతం ఆఫీసులకు వస్తున్నట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేష్ గోపీనాథన్ తెలిపారు.