PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 21న అమెరికా పర్యటనకు వెళ్లబోతున్నారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ప్రథమ మహిళ మోడీకి విందు ఇవ్వనున్నారు. ప్రధాని పర్యటనపై యావత్ అమెరికా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడంతో పాటు, వ్యాపారం-వాణిజ్యం పెరుగుదలకు మోడీ పర్యటన సహకరిస్తుందని అక్కడి మీడియా వ్యాఖ్యానిస్తోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో భారత్ రష్యా వైపు నిలవడం, ప్రపంచ వ్యాప్తంగా అలుముకుంటున్న ఆర్థిక మాంద్య పరిస్థితుల నేపథ్యంలో అమెరికా పర్యటనకు ప్రధాని వెళ్లబోతున్నారు.
ఇదిలా ఉంటే ప్రధాని మోడీ అమెరికా పర్యటన నేపథ్యంలో అక్కడి హక్కుల సంఘాలు, మోడీకి వ్యతిరేకంగా బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు సిద్ధం అవుతున్నాయి. బీబీసీ డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోడీ క్వశ్చన్’ని ప్రదర్శించేందుకు రెండు హక్కుల సంఘాలు నిర్ణయించాయి. హ్యూమన్ రైట్స్ వాచ్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ జూన్ 20న వాషింగ్టన్ లో ఈ డాక్యుమెంటరీ స్క్రీనింగ్ చేయబోతున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. పాత్రికేయులు, విశ్లేషకులు దీనికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు.
మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో 2002లో గుజారాత్ అల్లర్ల నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీని రూపొందించింది బీబీసీ. ఇందులో మోడీ హస్తం ఉన్నట్లుగా ఆరోపించింది. ఇదిలా ఉంటే ఈ డాక్యుమెంటరీ భారత్ లో సంచలనం సృష్టించింది. ప్రతిపక్షాలు ఈ డాక్యుమెంటరీకి మద్దతు నిలువగా.. బీజేపీ దీన్ని కొట్టిపారేసింది. భారత ప్రభుత్వం దీన్ని ‘వలసవాద మనస్తత్వం’గా అభివర్ణించింది. డాక్యుమెంటరీకి సంబంధించిన వీడియో లింక్ లను తొలగించాలని యూట్యూబ్, ట్విట్టర్ లను కేంద్రం ఆదేశించింది. పలు వర్సిటీలు దీన్ని స్క్రీనింగ్ చేయకుండా నిషేధించాయి. ఈ డాక్యుమెంటరీ తరువాత బీబీసీ ముంబై, ఢిల్లీ ఆఫీసులపై ఐటీ రైడ్స్ జరిగాయి. విదేశీ మారకద్రవ్య నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఐటీ ఈ రైడ్స్ చేసింది.