ప్రముఖ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి విడుదలైన స్కార్పియో ఎస్‌యూవీ చాలా పాపులర్ అయ్యింది. ఈ ఎస్‌యూవీ న్యూ జనరేషన్ వెర్షన్ కోసం వాహన ప్రియులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే.. న్యూ జనరేషన్ మహీంద్ర స్కార్పియో కోసం కస్టమర్ల నిరీక్షణకు తెరపడనుంది. జూన్ 27న రానున్న స్కార్పియో-ఎన్ ఇమేజ్‌లను కంపెనీ విడుదల చేసింది. 2022 మహీంద్ర స్కార్పియోను మహీంద్ర స్కార్పియో-ఎన్‌గా కస్టమర్ల ముందుకు తీసు రానుంది మహీంద్రా. న్యూ ఎస్‌యూవీతో పాటు ప్రస్తుత మోడల్‌ను కూడా మహీంద్ర స్కార్పియో క్లాసిక్ పేరిట విక్రయిస్తారు. స్కార్పియో డిజైన్ స్టైలింగ్‌ను కొనసాగిస్తునే స్వల్ప మార్పులను ఫీచర్లను స్పార్పియో-ఎన్‌లో జోడించారు.
ఎల్ఈడీ లైటింగ్, డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఆకట్టుకోనుండగా స్పార్పియో-ఎన్ ఇంటీరియర్ పోటోలను కంపెనీ వెల్లడించలేదు. న్యూ బాడీ-ఆన్-ఫ్రేం ప్లాట్‌ఫాంపై స్కార్పియో-ఎన్‌ను అభివృద్ధి చేశారు. ఎంఅండ్ఎం ఆటోమోటివ్ బిజినెస్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా మాట్లాడుతూ.. మహీంద్రా ల్యాండ్‌మార్క్ మోడల్‌గా పేరొందిన స్కార్పియో దేశీ ఆటోమొబైల్ పరిశ్రమకు ఐకానిక్ బ్రాండ్‌గా మారిందని, ఎస్‌యూవీ మార్కెట్ ప్రమాణాలను తిరగరాసిందని పేర్కొన్నారు. ఇక జూన్ 27న గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న స్కార్పియో-ఎన్ ధర వివరాలపై కంపెనీ త్వరలో అధికారిక ప్రకటనలో వెల్లడించనుంది.