భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ , వ్యవసాయ రంగం వేగంగా ఆధునీకరణ వైపు అడుగులు వేస్తున్నాయని చెప్పడానికి 2025 సంవత్సరం ఒక సజీవ సాక్ష్యంగా నిలిచింది. దేశ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా, ఒకే ఏడాదిలో దేశీయ ట్రాక్టర్ అమ్మకాలు పది లక్షల మైలురాయిని అధిగమించి సరికొత్త రికార్డును సృష్టించాయి. ట్రాక్టర్ అండ్ మెకనైజేషన్ అసోసియేషన్ (TMA) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2025లో ఏకంగా 10.9 లక్షల ట్రాక్టర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 20 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. కేవలం దేశీయ మార్కెట్లోనే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలోనూ భారతీయ ట్రాక్టర్లకు ఆదరణ పెరగడంతో ఎగుమతులు కూడా లక్ష మార్కును దాటి రికార్డు సృష్టించాయి.
The Raja Saab: నేటి నుంచి ‘ది ఓల్డ్ రాజా సాబ్’ సీన్స్.. నిర్మాత కీలక ప్రకటన!
ఈ రికార్డు స్థాయి విక్రయాల వెనుక ప్రభుత్వ నిర్ణయాలు , ప్రకృతి అనుకూలత ప్రధాన పాత్ర పోషించాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ట్రాక్టర్లపై ఉన్న జీఎస్‌టీని అక్టోబర్ నెలలో 12 శాతం నుండి 5 శాతానికి తగ్గించడం ఈ పరిశ్రమకు పెద్ద ఊతాన్ని ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల ట్రాక్టర్ల ధరలు హార్స్ పవర్ ఆధారంగా 40 వేల నుంచి లక్ష రూపాయల వరకు తగ్గడంతో రైతులు కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపారు. దీనికి తోడు 2025లో నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే 108 శాతం ఎక్కువగా నమోదు కావడంతో సాగు విస్తీర్ణం పెరిగి, రైతుల వద్ద నగదు లభ్యత మెరుగుపడింది. సాగు పనులకే కాకుండా గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పన , రవాణా రంగంలోనూ ట్రాక్టర్ల వినియోగం పెరగడం అమ్మకాలకు కలిసొచ్చింది.
కంపెనీల పరంగా చూస్తే మహీంద్రా అండ్ మహీంద్రా 24 శాతం మార్కెట్ వాటాతో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ సంస్థ సుమారు 2.37 లక్షల యూనిట్లను విక్రయించగా, స్వరాజ్ , సోనాలికా సంస్థలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2024లో 9.1 లక్షలుగా ఉన్న అమ్మకాలు, కేవలం ఏడాది కాలంలోనే 10.9 లక్షలకు చేరడం చూస్తుంటే భారత రైతులకు యంత్రాలపై పెరుగుతున్న అవగాహన , గ్రామీణ ఉపాధి వనరుల బలోపేతం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిణామం రాబోయే రోజుల్లో దేశీయ వ్యవసాయ ఉత్పాదకతను మరింత పెంచడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లోని మరిన్ని కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
MLA Malla Reddy : సంక్రాంతి సంబరాల్లో ముగ్గు వేసిన మల్లారెడ్డి..