GST: చక్కెర రైతులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీపి కబురు చెప్పారు. మొలాసిస్‌పై పన్నులను 28 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ శనివారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ చర్య వల్ల చెరుకు రైతులకు మేలు జరుగుతుంది. పశువుల దాణా ధర కూడా తగ్గుతుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మనుషులు వినియోగించే మద్యాన్ని కూడా లెవీ నుంచి మినహాయించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.
70 శాతం తృణధాన్యాలు ఉన్న పిండిపై జీఎస్టీని గణనీయంగా తగ్గించారు. పిండిని వదులుగా అమ్మితే సున్నా శాతం పన్ను ఉంటుందని, ముందుగా ప్యాక్ చేసి లేబుల్ చేసి విక్రయిస్తే 5 శాతం పన్ను ఉంటుందని సీతారామన్ ప్రకటించారు.
Read Also: Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. 14 మంది మృతి.. సంఖ్య పెరిగే అవకాశం..
52వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. మొలాసిస్‌పై జీఎస్టీ తగ్గించడం వల్ల మిల్లర్ల వద్ద ఎక్కువ డబ్బు ఉంటుందని చెరుకు రైతుల బకాయిలను వేగంగా క్లియరెన్స్ చేయవచ్చని ఆమె అన్నారు. ఈ నిర్ణయం పశువుల దాణా ఖర్చులను తగ్గించేందుకు కారణమవుతుందని ఆమె అన్నారు.
ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కాహాల్(ఈఎన్ఏ)పై కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ఈఎన్ఏపై పన్ను విధించే హక్కు రాష్ట్రాలు కోల్పోయాని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. జీఎస్టీ కౌన్సిల్ మాత్రం రాష్ట్రాలకు ఆ హక్కును ఇచ్చిందని, రాష్ట్రాలు పన్నులు విధించాలనుకుంటే, దాన్ని స్వాగతిస్తామని అన్నారు. పన్ను విధించే హక్కు జీఎస్టీ కౌన్సిల్ కి ఉన్నప్పటికీ.. పన్నులు విధించడం లేదని ఆమె తెలిపారు.