Car Loan Planning: ఎంతో మంది మధ్యతరగతి జనాల కలల స్వప్నం సొంత ఇల్లు, కారు కొనుక్కోవడం. అయితే అందరూ ఈ కలను నిజం చేసుకోడానికి విశేషంగా కష్టపడుతారు. కానీ అంత కష్టపడి కొనుగోలు చేసే టైంలో ఈ విషయాలను పట్టించుకోకపోతే ఆ కష్టానికి విలువ లేకుండా పోతుందని చెబుతున్నారు నిపుణులు. మీరు కార్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే తొందరపడి కారు లోన్ తీసుకోకుండా ఇలా ప్లాన్ చేసుకోవాలని చెబుతున్నారు. ఇంతకీ ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: High Court: విద్యాశాఖ అధికారుల తీరుపై హైకోర్టు సిరీయస్.. ఐఏఎస్ అధికారికి నోటీసులు..!
CIBIL స్కోరు ముఖ్యం బాస్..
కారు రుణం పొందే విషయంలో మీ CIBIL స్కోరు అత్యంత ముఖ్యమైన అంశం. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు మీకు రుణం ఇవ్వాలో వద్దో అనేది, అలాగే వడ్డీ రేటును నిర్ణయించడానికి ఈ స్కోర్‌ను కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాయి. CIBIL స్కోరు 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందే అవకాశాలు గణనీయంగా ఉన్నాయి. అయితే తక్కువ సిబిల్ స్కోరు ఉంటే అది మీ రుణ అర్హతను క్లిష్టతరం చేయవచ్చని, అధిక వడ్డీ రేట్లకు దారితీయవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
కారు రుణంపై వడ్డీ రేటు బ్యాంకు, రుణ వ్యవధి, మీ క్రెడిట్ ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది. వడ్డీ రేట్లు బ్యాంకు నుంచి బ్యాంకుకు మారవచ్చు. అందువల్ల రుణం తీసుకునే ముందు, రెండు లేదా మూడు బ్యాంకులు లేదా NBFCల వడ్డీ రేట్లను పోల్చి చూసుకోవాలని చెబుతున్నారు. కొంచెం తక్కువ వడ్డీ రేటు కూడా దీర్ఘకాలంలో మీకు వేల రూపాయలు ఆదా చేస్తుంది.
చాలా మంది EMI పై మాత్రమే దృష్టి పెడతారు, ప్రాసెసింగ్ ఫీజును పట్టించుకోరు. ఈ రుసుము సాధారణంగా లోన్ మొత్తంలో 0.5% నుంచి 2% వరకు ఉంటుంది. కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లను అందిస్తూనే ఎక్కువ ప్రాసెసింగ్ రుసుములను వసూలు చేస్తాయి. అందువల్ల లోన్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు మొత్తం ఖర్చును పరిగణనలోకి తీసుకోండి. అలాగే మీరు కారు ధరలో ఎక్కువ భాగాన్ని డౌన్ పేమెంట్‌గా చెల్లిస్తే, మీరు తక్కువ రుణం తీసుకుంటారు. నిజానికి ఇది మీ EMI, వడ్డీ చెల్లింపులను తగ్గిస్తుంది. చాలా మంది నిపుణులు కారు విలువలో సుమారుగా 20–30% డౌన్ పేమెంట్ చెల్లించాలని సిఫార్సు చేస్తున్నారు.
దీర్ఘకాలిక రుణం తీసుకోవడం వల్ల కట్టా్ల్సిన ఈఎంఐ తగ్గుతుంది, కానీ మొత్తం వడ్డీ ఎక్కువగా ఉంటుంది. అయితే స్వల్పకాలిక రుణానికి ఈఎంఐలు ఎక్కువగా ఉంటాయి కానీ వడ్డీ తక్కువగా ఉంటుంది. కాబట్టి మీ ఆదాయం, ఖర్చుల ఆధారంగా రుణ కాలాన్ని ఎంచుకోవడం తెలివైన పని అని చెబుతున్నారు. మీ కారు రుణ EMI మీ నెలవారీ ఆదాయంలో 15 నుంచి 20 శాతానికి మించకూడదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. EMI ఈ మొత్తాన్ని మించి ఉంటే, అది ఇతర ఖర్చులు, పొదుపులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కారు కొనుగోలుకు రుణం తీసుకోవడం తప్పు కాదు, కానీ సరైన ప్లాన్ లేకుండా తీసుకోవడం అనేక సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.
మీరు కొత్త కారు కొనుగోలు చేయాలనే నిర్ణయం తీసుకునే ముందు మీ CIBIL స్కోరు, వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, డౌన్ పేమెంట్, EMIలను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని చెబుతున్నారు. సరైన ప్లాన్‌తో తీసుకున్న కారు రుణం మీ భవిష్యత్తు ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని, మీ జేబుపై అధిక భారాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు.