వంట నూనెల ఎంఆర్‌పీని 10 రూపాయలు తగ్గించాలన్న కేంద్రం
ప్రపంచవ్యాప్తంగా వంట నూనెల రేట్లు దిగొచ్చిన నేపథ్యంలో వాటి గరిష్ట చిల్లర ధరను ఆ మేరకు సవరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. దిగుమతి చేసుకునే నూనెల ఎంఆర్‌పీని 10 రూపాయలు తగ్గించాలని అడిగింది. మన దేశం వంట నూనెల వినియోగంలో 60 శాతానికి పైగా సరుకును విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
రూపాయి విలువను పెంచేందుకు చర్యలు ప్రకటించిన ఆర్బీఐ
ఈ ఏడాది ఇప్పటికే రూపాయి మారకం విలువ 6 శాతం పడిపోయిన నేపథ్యంలో ఆర్బీఐ నష్టనివారణ చర్యలను ప్రకటించింది. దేశంలోకి విదేశీ మారక ప్రవాహాన్ని పెంచేందుకు మార్గం సుగమం చేసింది. స్వల్ప కాల కార్పొరేట్ అప్పులతోపాటు మరిన్ని ప్రభుత్వ సెక్యూరిటీలను విదేశీ పెట్టుబడిదారులు కొనుగోలు చేయటానికి ఈ చర్యలు ఉపయోగపడతాయి. ఇండియా ఫారెక్స్ నిల్వలు గత 9 నెలల్లో 40 బిలియన్ డాలర్లకు పైగా కరిగిపోయాయి.
12 వారాల కనిష్టానికి పడిపోయిన చమురు ధరలు
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యంతోపాటు కరోనా వల్ల చైనాలో డిమాండ్ తగ్గే అవకాశం ఉందన్న భయాల నేపథ్యంలో చమురు ధరలు 12 వారాల కనిష్టానికి దిగొచ్చాయి. సెప్టెంబర్ నెల బ్రెంట్ క్రూడాయిల్ ఫ్యూచర్స్ డెలివరీ 2.9 శాతం తగ్గింది. దీంతో ప్రస్తుతం ఒక బ్యారెల్ రేటు 99 పాయింట్ ఏడు, ఎనిమిది డాలర్లు పలుకుతోంది. అమెరికాలోని వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ రేటు 3.2 శాతం తగ్గటంతో ఒక పీపా ఇంధనం ధర ఇప్పుడు 96 పాయింట్ మూడు, ఒకటి డాలర్ల వద్ద ఉంది. ఈ రేట్లు వరుసగా 9 శాతం, 8 శాతం పడిపోయిన తెల్లారే ఈ తగ్గుదల కూడా జరగటం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
గోధుమ పిండి, సంబంధిత ఉత్పత్తుల ఎగుమతులకు చెక్ పెట్టిన కేంద్రం
ఇప్పటికే గోధుమ ఎగుమతులను నిలిపేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గోధుమ పిండితోపాటు సంబంధిత ఉత్పత్తులన్నింటి ఎగుమతులకూ చెక్ పెట్టింది. దీంతో ఇతర దేశాలకు షిప్‌మెంట్లను పంపాలనుకునే ఎగుమతిదారులు ఇకపై మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది పూర్తిగా నిషేధం కాదు. ఎగుమతులను పాక్షికంగా అదుపు చేయటం మాత్రమే.
బుధవారం నుంచి 50 రూపాయలు పెరిగిన వంట గ్యాస్ ధర
వంట గ్యాస్ ధర బుధవారం నుంచి 50 రూపాయలు పెరిగింది. ఇంటి అవసరాలకు వాడుకునే 14 పాయింట్ 2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్‌కి ఈ కొత్త రేటు వర్తిస్తుంది. 5 కేజీల సిలిండర్ రేటును కూడా 18 రూపాయలు పెంచారు. మరో వైపు 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రేటు ఎనిమిదిన్నర రూపాయలు తగ్గింది.