తెలంగాణలో లాక్‌డౌన్‌ను మరో వారం రోజుల పాటు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం… అయితే, ఇదే సమయంలో.. గతంలో ఉన్న సడలింపుల సమయాన్ని పెంచింది.. గతంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే సడలింపులు ఉండగా.. ఇప్పుడు ఆ సమయాన్ని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.. ఇక, ఇళ్లకు చేరుకోవడానికి మరో గంటల సమయం ఇచ్చింది.. దీంతో.. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.. ఈ నేపథ్యంలో బ్యాంకుల పని వేళల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ రోజు సమావేశమైన రాష్ర్ట స్థాయి బ్యాంకర్ల కమిటీ.. ప్రస్తుతం ఉన్న బ్యాంకుల పని వేళలపై సమీక్షించింది. లాక్‌డౌన్ సమయం సడలింపుతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకుల సేవలు అందుబాటులో ఉంచాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.. మారిన బ్యాంకు వేళలు జూన్ 1వ తేదీ నుంచి అంటే రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. బ్యాంకర్ల కమిటీ నిర్ణయం.. జూన్ 9వ తేదీ వరకు అమల్లో ఉండనుంది.. అయితే, ఇప్పటి వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనిచేశాయి బ్యాంకులు.. ఇప్పుడు 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్నాయి.. మొత్తంగా 4 గంటలు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను జూన్ 9వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.