బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ సన్నీ ఆవేశం అతన్ని ఇతర కంటెస్టెంట్స్ నుండి నిదానంగా దూరం చేస్తోంది. కొన్ని టాస్క్ లలో చక్కటి పెర్ఫార్మెన్స్ ఇస్తున్న సన్ని, కారణం ఏదైనా కానీ కొన్ని చోట్ల మాత్రం తన ఆవేశాన్ని అదుపు చేసుకోలేకపోతున్నాడు. గత వారం ఈ విషయంలో నాగార్జున నుండి విమర్శలూ ఎదుర్కొన్నాడు. అయితే బుధవారం ప్రసారమైన ఎపిసోడ్ లో సన్నీ మరోసారి తన సహనాన్ని కోల్పోయాడు. అతని పక్షాన నిలిచిన కాజల్ చెప్పిన మాటలనూ సన్నీ వినకపోవడం చూసేవారికి చిత్రంగా అనిపించింది.
Read Also : ‘ఎంసిఏ’ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న నాని
కెప్టెన్సీ టాస్క్ ‘నీ ఇల్లు బంగారం కాను’లో బెలూన్ లో గ్యాస్ నింపి పగల కొట్టే ఆటలో ప్రియాంక, మానస్ పోటీ పడ్డారు. అందులో అత్యధిక బెలూన్స్ ను పగలగొట్టి పింకీ కెప్టెన్సీ టాస్క్ పోటీకి అర్హత సంపాదించుకుంది. ఆ తర్వాత పోటీ సన్నీ – సిరికీ మధ్య పడింది. అయితే అది స్విమింగ్ పూల్ లో జరిగే టాస్క్ కావడంతో కెప్టెన్ రవి కోరిక మేరకు సిరి బదులు వేరెవరైనా ఆట ఆడొచ్చని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో సిరి బదులు మానస్ ఆడటానికి రెడీ అయ్యాడు. స్విమింగ్ పూల్ ఈ సైడ్ ఉన్న టీ షర్ట్ ను ధరించి, అటు చివరకు వెళ్ళాలి, మళ్ళీ అటు సైడ్ టీ షర్ట్ ధరించి ఈ చివరకు రావాలి. బజర్ మోగే సమయానికి ఎవరు ఎక్కువ టీ షర్ట్స్ ధరిస్తే వారు గెలిచినట్టు. నిజానికి ఈ పోటీలో సన్నీ ఎక్కువ టీ షర్ట్స్ ధరించాడు.
కానీ అతను కొన్ని టీషర్ట్స్ ను రివర్స్ లో వేసుకోవడంతో వాటిని సంచాలకుడు రవి పరిగణనలోకి తీసుకోలేదు. తాను ధరించిన వాటి మీద లేబుల్ లేదని సన్నీ వాదించినా, ఒకసారి చూడగానే అవి రివర్స్ లో ఉన్నాయనే విషయం అర్థమైపోతుందని రవి చెప్పాడు. తొలుత రవితో కాజల్ కూడా వాదించినా, ఆ తర్వాత అతని పాయింట్ ను అంగీకరించింది. అదే విషయాన్ని సన్నీకి చెప్పాలని చూసినా అతను వినకుండా అసహనం వ్యక్తం చేశాడు. తన వాళ్ళు కూడా అవతలి వారికే సపోర్ట్ చేస్తున్నారంటూ వాపోయాడు. టీ షర్ట్ కరెక్ట్ గా ధరించాలనే మాట రవి గేమ్ ప్రారంభానికి ముందు చెప్పలేదని, మధ్యలో చెప్పాడని ఆరోపించాడు. అతని ఆవేదన అర్థంచేసుకున్న సిరి నెక్ట్స్ గేమ్ లో సన్నీకి సాయం చేయాలనే నిర్ణయానికి వచ్చింది. అయితే తాను సన్నీకి సాయం చేస్తానని, సిరిని మానస్ కు హెల్ప్ చేయమని షణ్ముఖ్ చెప్పాడు.