ఐదవ రోజు కోటి దీపోత్సవ కార్యక్రమంలో శ్రీ సత్యగౌర చంద్ర దాస, శ్రీ నిష్కంచన భక్త ప్రభూజీ, శ్రీ కారుణ్య సాగర దాస ప్రభూజీ, శ్రీ విష్ణు దాస ప్రభూజీ వార్లు దేవుడికి దీపం పెట్టి, దేవుణ్ణి ఎలా వలలో పడేయొచ్చో, దీపం వల్ల మనుషుల వయో పరిమితిని ఎలా పెంచుకోవచ్చో, దీపం యొక్క ప్రాముఖ్యతను, కోటి దీపోత్సవం నిర్వహిస్తున్న నరేంద్ర చౌదరి దంపతులను అభినందిస్తూ అనుగ్రహభాషణం చేయగా, బ్రహ్మశ్రీ కాకునూరి సూర్య నారాయణ మూర్తి గారు కార్తిక మాస ప్రాధాన్యతను వివరిస్తూ భక్తులకు ప్రవచనామృతం చేశారు.
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి శ్రీమతి లలిత దంపతులు అతిథులుగా హాజరయ్యారు.
వీటితో పాటు వేదికపై కనకదుర్గమ్మకు కోటి గాజుల అర్చన, భక్తులతో కనకదుర్గ విగ్రహాలకు కోటి గాజుల అర్చన, ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ కల్యాణం, తులసీ దామోదర కల్యాణం, సింహ వాహనం, పల్లకి సేవలు జరిగాయి. ఇవికాక రోజూ జరిగే జ్యోతి ప్రజ్వలన, బంగారు లింగోద్భవం, మహా నీరాజనం, వచ్చిన అతిథులకు గురు వందనం, గౌరవ సత్కారాలు, సప్త హారతి వంటి కార్యక్రమాలు జరిగాయి.