Xiaomi EV Cars: స్మార్ట్‌ఫోన్‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్లతో మంచి పేరు తెచ్చుకున్న షియోమి (Xiaomi).. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల రంగంలోనూ దూకుడుగా ముందుకు దూసుకెళ్తోంది. ఫోన్లు తయారు చేసే వేగంలోనే EV కార్లను కూడా మార్కెట్లోకి తీసుకొస్తూ, ఆటోమొబైల్ ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తాజాగా జరిగిన లైవ్ స్ట్రీమ్‌లో షియోమి సీఈవో లే జున్ (Lei Jun) సంస్థ భవిష్యత్ లక్ష్యాలపై కీలక అప్‌డేట్స్ ఇచ్చారు.
Read Also: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. స్లిమ్ బాడీ, ఫ్లాట్ డిస్‌ప్లేతో Realme 16 Pro Launch!
2026లో 5.5 లక్షల EVల డెలివరీ లక్ష్యం
2026 నాటికి 5.5 లక్షల ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేయాలని షియోమి టార్గెట్ గా పెట్టుకుందని సంస్థ సీఈవో లే జున్ తెలిపారు. 2025తో పోలిస్తే ఈసారి మరింత దూకుడు పెంచాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 2025లో మొదట కంపెనీ 350,000 EV కార్ల డెలివరీని లక్ష్యంగా పెట్టుకుంది.. కానీ ఆ టార్గెట్‌ను డిసెంబర్ ప్రారంభంలోనే పూర్తి చేసి సంచలనం సృష్టించింది. ఏడాది ముగిసే సరికి 410,000కి పైగా యూనిట్లను డెలివరీ చేసి, ఆటో మొబైల్ ఇండస్ట్రీలో తన సత్తా ఏంటో నిరూపించుకుంది. ఇక, 410,000 నుంచి 550,000కి వెళ్లాలంటే దాదాపు 34 శాతం వృద్ధి సాధించాల్సి ఉంటుంది. EV రంగంలో కొత్త కంపెనీకి ఇది చిన్న విషయం కాదు.. కానీ షియోమి గతంలోనే అసాధ్యమనుకున్న లక్ష్యాలను సాధించిన తీరు చూస్తే.. 2026 టార్గెట్ కూడా అందుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
Read Also: Silver Rates: సిల్వర్ మళ్లీ విశ్వరూపం.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా.. అద్భుత వృద్ధి
షియోమి EV ప్రయాణాన్ని అధికారికంగా మార్చి 30, 2021న ప్రకటించింది. అప్పటికే టెస్లా, ఇతర చైనా బ్రాండ్లు EV మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ‘ఇంత ఆలస్యంగా వచ్చి ఏం చేస్తారు?’ అంటూ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ షియోమి వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ.. EV రంగంలో అత్యంత వేగంగా లాభాలు ప్రకటించిన సంస్థగా నిలిచింది. అలాగే, 2025లో మూడో త్రైమాసికం (Q3)లో 108,796 EVల డెలివరీతో సంస్థ EV విభాగం తొలిసారి లాభాలను ప్రకటించింది. కొత్త ఆటోమొబైల్ కంపెనీలు లాభాల్లోకి రావడానికి సాధారణంగా ఎన్నో ఏళ్లు పడుతుంటే.. షియోమి మాత్రం చాలా తక్కువ సమయంలోనే ప్రాఫిట్స్ అందుకుంది.

ప్రస్తుతం ఉన్న ప్రధాన మోడల్స్..
* షియోమి విజయానికి ప్రధాన కారణం రెండు మోడల్స్:
* SU7 – స్టైలిష్ ఎలక్ట్రిక్ సెడాన్
* YU7 – భారీ సైజ్ SUV.. ఇవి కంపెనీని EV మార్కెట్లో బలంగా నిలబెట్టాయి. కానీ 2026 టార్గెట్‌ను అందుకోవాలంటే మరిన్ని వెరైటీ మోడల్స్ అవసరం అని షియోమి గ్రహించింది. అందుకే 2026లో నాలుగు కొత్త మోడల్స్ ను విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది.
2026లో రానున్న కొత్త కార్లు
* SU7 Facelift – పాపులర్ సెడాన్‌కు డిజైన్, ఫీచర్స్ అప్‌గ్రేడ్
* SU7 Executive Version – లగ్జరీ ప్రియుల కోసం ప్రత్యేక ఎడిషన్
* Extended-Range 7-Seater SUV – 7 సీట్లతో లాంగ్ డ్రైవ్ కోసం
* Extended-Range 5-Seater SUV – 5 సీట్లతో కాంపాక్ట్ SUV
అయితే, Extended-Range EVలు అంటే ఏమిటి? అని అందరు ఆలోచిస్తున్నారు కదా.. ఇక, ప్యూర్ ఎలక్ట్రిక్ కార్లు బ్యాటరీపై మాత్రమే నడుస్తాయి. కానీ Extended-Range EVల్లో చిన్న పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంటుంది. ఇది ప్రయాణం మధ్యలో బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. దీంతో ఛార్జింగ్ స్టేషన్ టెన్షన్ లేకుండా ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది. భారతదేశం లాంటి ఇంకా ఛార్జింగ్ నెట్‌వర్క్ విస్తరణ పూర్తిగా జరగని దేశాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
విడుదల టైమ్‌లైన్
* 2026 మొదటి అర్ధభాగం: SU7 Facelift, 7-Seater SUV
* 2026 రెండో అర్ధభాగం: SU7 Executive, 5-Seater SUV.. ఈ వ్యూహంతో కంపెనీ EVలపై ఏడాది పొడవునా హైప్ కొనసాగించాలని ప్లాన్ చేస్తోంది. కాగా, ఈవీ మార్కెట్ షియోమి కార్లను బాగా ఆదరిస్తోందని గణాంకాలే చెబుతున్నాయి. 2025 డిసెంబర్‌లో 50,000కి పైగా EVలు డెలివరీ చేసి కంపెనీ కొత్త చరిత్ర సృష్టించింది. ఈ నెలాఖరులో చైనా ప్యాసింజర్ కార్ అసోసియేషన్ (CPCA) అధికారిక రిపోర్టు విడుదల కానుంది. కానీ ఇప్పటి వరకు ఉన్న సంఖ్యలే షియోమి EV భవిష్యత్ ఎంత బలంగా ఉందో తెలియజేస్తున్నాయి.
ఇక షియోమి కేవలం ‘ఫోన్ కంపెనీ’ కాదు
ఫోన్లతో మొదలైన షియోమి కంపెనీ ప్రయాణం.. ఇప్పుడు EV కార్లతో ప్రపంచ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుంది. 2026 టార్గెట్‌ను సాధిస్తే.. ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ తయారీ సంస్థల జాబితాలో షియోమి కూడా చేరడం ఖాయం అని చెప్పాలి. ఈ వేగం చూస్తుంటే.. షియోమి ఎలక్ట్రిక్ కార్ల ప్రయాణం ‘సులభం’ అనిపించేలా కనిపించినా.. దాని వెనక ఉన్న వ్యూహం, అమలు మాత్రం అసాధారణం అనే చెప్పాలి.