ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. వైసీపీ గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్ హత్యతో గ్రామం అట్టుడికిపోగా.. హత్యకు గురైన గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావును గ్రామస్తులు తరమడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.. ఎమ్మెల్యే తలారిని తరిమికొట్టింది వైసీపీలోని మరో వర్గం అనే ప్రచారం సాగుతుండగా.. ఈ ఘటనపై స్పందించిన ఆయన.. జి.కొత్తపల్లిలో తనపై దాడి చేసింది వైసీపీ కార్యకర్తలు కాదని స్పష్టం చేశారు.
Read Also: Ganji Prasad Murder: ఎమ్మెల్యే తలారిపై సంచలన ఆరోపణలు..
తనపై వైసీపీ ముసుగులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు.. జి.కొత్తపల్లి వైసీపీ గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్ హత్య దారుణమైన విషయమన్న ఆయన.. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై మృతుడు కుటుంబ సభ్యులతో మాట్లాడతా అన్నారు. అయితే, జి.కొత్తపల్లిలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు మాత్రం వాస్తవమే అన్నారు. రెండు వర్గాలను కలిపి సన్మానించడం జరిగింది.. అయినా ఒక్కతాటిపైకి రాలేదున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు లేకుండా పోలీసులు ఆధీనంలోకి తీసుకుంటారని తెలిపారు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు.