ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన గణపవరంలో ‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 10.10 గంటలకు గణపవరం చేరుకోనున్న సీఎం.. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం డిగ్రీ కాలేజీ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం ముగిశాక తిరిగి 1 గంటకు తాడేపల్లికి చేరుకుంటారు.
ఈ కార్యక్రమం సందర్భంగానే సీఎం జగన్ నాలుగో ఏడాది మొదటి విడతగా రైతుల ఖాతాల్లో రూ. 5,500 చొప్పున జమ చేయనున్నారు. గణపవరం నుంచి వర్చువల్‌గా ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి వెళ్లనున్నాయి. ప్రతి ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున రైతులకు సీఎం జగన్ సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నెల 31వ తేదీన కేంద్రం రూ. 2 వేలు చొప్పున పీఎం కిసాన్ నిధులు ఇవ్వనుంది. మొత్తంగా నెలాఖరు నాటికి 50.10 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,500 చొప్పున దాదాపు రూ.3,758 కోట్లు జమ చేయనున్నారు.