ఆంధ్రప్రదేశ్‌లో మరో సంక్షేమ కార్యక్రమానికి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పశుపోషకుల ఇంటిముంగిటే మూగజీవాలకు మెరుగైన వైద్యసేవలందించే లక్ష్యంతో వైఎస్సార్ సంచార పశు ఆరోగ్యసేవలను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. సుమారు రూ.278 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల అంబులెన్స్‌లు ఏర్పాటు చేయనున్నారు. అయితే.. తొలిదశలో రూ.143 కోట్లతో సిద్ధం చేసిన 175 అంబులెన్స్‌లను తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు.
అంతకుముందు డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య వాహనాల్లో ఉన్న సదుపాయాలను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. ఇకపై ఏపీలో మూగజీవాలకు మెరుగైన వైద్యం అందనుంది. పశు పోషకులు ఇంటి దగ్గరకే వచ్చి చికిత్స అందిస్తారు. ఒక్కో అంబులెన్స్ మెయిన్‌టెనెన్స్ ఖర్చుల నెలకు 1.90 లక్షల చొప్పున, రెండేళ్ళకు మొత్తం రూ. 155 కోట్ల నిధులు ఖర్చు చేయనునుంది ఏపీ ప్రభుత్వం.
రెండో దశలో 135 కోట్ల రూపాయలతో మరో 165 అంబులెన్సులు ఏర్పాటు కానున్నాయి. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో రెండు పశు అంబులెన్సులను అందుబాటులో ఉంచనున్నారు. 108 సేవల మాదిరిగానే అత్యాధునిక సౌకర్యాలు పశు అంబులెన్సులతో సమకూర్చారు. వీటి కోసం ప్రత్యేకంగా టోర్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చారు. 1962కు కాల్ చేస్తే పశువుల అంబులెన్సులు రానున్నాయి. సత్వరమే స్పందించి పశువులకు కావాల్సిన చికిత్స అందించనున్నారు పశు పోషకులు. మెరుగైన వైద్యం కావాల్సి వస్తే దగ్గరలోని ఏరియా పశు వైద్యశాలకు తరలిస్తారు. అంబులెన్సుల నిర్వహణ ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.