ఏపీలో నామినేటెడ్ పదవుల ప్రకటన పై ఉత్కంఠత నెలకొంది. ప్రభుత్వం విధానంగా పెట్టుకున్న సామాజిక వర్గాల కూర్పు లెక్కలు కొలిక్కి వచ్చాయి. అయితే రేపు వైఎస్సార్ రైతు దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉండటంతో ఎప్పుడు ప్రకటించాలన్నదానిపై తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది.
read also : ఇండియా కరోనా అప్డేట్.. 24 గంటల్లో 43,733
వైసీపీ ప్రభుత్వం సుమారు 80 వరకు కార్పొరేషన్లను త్వరలో ప్రకటించనుంది. పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవుల భర్తీ జరుగనుంది. గత కొద్ది రోజులుగా నియామకాల పై కసరత్తు జరుగుతోంది. రీజనల్ ఇంఛార్జుల పలు మార్లు కూర్చుని ఉమ్మడిగా కూడా నేతల ఎంపిక పై చర్చించారు. తమ పరిధి మేరకు సిద్ధం చేసిన పేర్ల జాబితాను ముఖ్యమంత్రి జగన్ ముందు పెట్టారు. వాటి పై సీఎం కొన్ని సవరణలు, సూచనలు చేశారు. అన్ని నామినేటెడ్ పదవుల్లో 50 శాతం స్థానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇవ్వాలని జగన్ సర్కార్ విధానంగా పెట్టుకుంది. సమీకరణాల్లో సరిపోయే విధంగా నేతల ఎంపిక, జిల్లాల వారీగా ప్రాతినిధ్యం కసరత్తు కూడా పూర్తి అయిందని తెలుస్తోంది.
మరోవైపు టీటీడీ, శ్రీశైలం దేవాలయాల పాలకమండళ్ళ నియామకం కూడా పూర్తి అయినట్లు సమాచారం. టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డినే రెండో దఫా కొనసాగిస్తారని సమాచారం. అయితే భారీ ఎత్తున నామినేటెడ్ పదవులు ఇస్తుండడంతో ప్రకటన ఎప్పుడు చేయాలన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. రేపు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఇది జరిగాక పదవుల ప్రకటన ఉంటుందని కొందరు నేతలు చెబుతున్నారు.