కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పబ్జీ గేమ్ ఓ బాలుడి ప్రాణం తీసింది. పబ్జీ గేమ్ ఓడిపోయావని తోటి పిల్లలు హేళన చేయడంతో మనస్తాపానికి గురైన బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మచిలీపట్నంలోని హౌసింగ్ బోర్డుకు చెందిన ఊటుకూరు ప్రభు అనే 16 ఏళ్ల బాలుడికి ఫోన్‌లో పబ్జీ ఆడటం అలవాటు. రోజూలాగే పబ్జీ గేమ్ ఆడాడు. అయితే ఈసారి గేమ్‌లో ప్రభు ఓడిపోయాడు. దీంతో.. ఓడిపోయాడని తోటి స్నేహితులు అపహాస్యం చేశారు. గెలుపు మంత్రాన్ని మాత్రమే జపించే ఈ సమాజంలో.. ఓడిపోయిన వాడికి చోటే లేదని బాలుడు భావించాడు.
దీంతో ఇంటికి వెళ్లి గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం ఎంతకీ గదిలో నుంచి వెలుపలికి రాకపోవడంతో తండ్రి వెళ్లి చూశారు. ఫ్యాన్‌కు కొడుకు మృతదేహం వేలాడుతూ కనిపించడంతో ఆ తండ్రి ఒక్కసారిగా షాక్ గురై సొమ్మసిల్లి పడిపోయాడు. ప్రభు మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా ప్రభు మృతిపట్ల కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తాంతియా కుమారి విచారం వ్యక్తం చేశారు. పబ్జీ గేమ్ వల్ల ఎంతో మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, బాలుడు ప్రభు మృతి అందరికీ ఓ కనువిప్పు కావాలన్నారు.