వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సామాజిక న్యాయభేరీ యాత్ర గురువారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం జిల్లాకు చేరుకుంది. ఈ మేరకు విజయనగరం జిల్లాలో పైడి భీమవరం నుంచి వైసీపీ మంత్రుల సామాజిక న్యాయభేరీ యాత్ర ప్రారంభమైంది. నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి వైసీపీ నేతల బస్సు యాత్ర వలస గ్రామం చేరుకుంది. అక్కడ బహిరంగసభ అనంతరం మంత్రుల బస్సు యాత్ర విజయనగరం పట్టణంలోకి ప్రవేశించనుంది. ఈ సందర్భంగా విజయనగరంలో ప్యూమా జంక్షన్ వద్ద ఏర్పాటు చేసినభారీ బహిరంగ సభలో వైసీపీ మంత్రులు మాట్లాడనున్నారు. ఆ తర్వాత విశాఖలోనే రాత్రి విడిది చేయనున్నారు.
కాగా వైసీపీ మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరీ యాత్ర ఏపీ వ్యాప్తంగా నాలుగు ప్రాంతాలలో కొనసాగనుంది. ఈనెల 29 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు వైసీపీ మంత్రులు నాలుగు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ బస్సు యాత్రలో 17 మంది మంత్రులతో పాటు వైసీపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. ఈనెల 30తో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు చేసిన సామాజిక న్యాయాన్ని వివరించేందుకు వైసీపీ ప్రజాప్రతినిధులు సామాజిక న్యాయభేరి పేరుతో బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.