టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. లోకేష్ ఎమ్మెల్సీ పదవీకాలం గడువు త్వరలోనే ముగుస్తుందని.. అందుకే లోకేష్ తిమ్మిరెక్కిన కాలును విదిలించినంత ఈజీగా నోరు పారేసుకుంటున్నాడని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్సీ పదవి పోయిన తర్వాత లోకేష్‌కు ఏ పదవీ వచ్చేది లేదనే విషయం అర్థమైందని ఎద్దేవా చేశారు. అమరావతి పేరుతో రూ.లక్షల కోట్ల స్కామ్‌కు పాల్పడి అడ్డంగా దొరికాక అందరినీ భూఆక్రమణదారులుగా చిత్రీకరిస్తున్నాడంటూ లోకేష్‌పై విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
లోకేశ్ బరితెగింపు చూస్తుంటే…MLC పదవీకాలం గడువు దగ్గర పడుతోంది. తర్వాత ఏ పదవి దక్కేది లేదు. అందుకే తిమ్మిరెక్కిన కాలును విదిలించినంత ఈజీగా నోరు పారేసుకుంటున్నాడు. అమరావతి పేరుతో లక్షల కోట్ల స్కామ్‌కు పాల్పడి అడ్డంగా దొరికాక, అందరినీ భూఆక్రమణదారులుగా చిత్రీకరిస్తున్నాడు పప్పు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 29, 2022
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుపైనా విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. అసలు మద్యం సిండికేట్లకు లైసెన్సిచ్చిందే మాజీ సీఎం చంద్రబాబు అని ఆరోపించారు. వంగవీటి రంగా హంతకులకు వైజాగ్‌ను కానుకగా రాసిచ్చి భూదందాలకు, భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రకటనకు ముందే వేల ఎకరాల భూములను కొనిపించింది ఎవరు..? అని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రను ఏదో జరుగుతోందంటూ తండ్రీ, కొడుకులు బెదరగొడుతున్నారంటూ టీడీపీ నేతలపై ట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.
రంగా హంతకులకు వైజాగ్‌ను కానుకగా రాసిచ్చి భూదందాలకు, మద్యం సిండికేట్లకు లైసెన్సిచ్చిందే చంద్రబాబు. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రకటనకు ముందే వేల ఎకరాల భూములను కొనిపించింది ఎవరు? ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్రను ఏదో జరుగుతోందంటూ బెదరగొడుతున్నారు తండ్రీ, కొడుకులు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 30, 2022