Karanam Dharmasri: ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రను వైసీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రాజధానులకు అనుకూలంగా ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా విశాఖ రాజధానికి మద్దతుగా జేఏసీని ఏర్పాటు చేశారు. విశాఖ రాజధానికి అనుకూలంగా వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టు భర్తీ అంశం తెరపైకి వచ్చింది. 1998లో డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులను మినిమమ్ టైం స్కేల్‌పై నియామకం చేపట్టాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇలా ఎంపికైన వారిలో ధర్మశ్రీ కూడా ఉన్నారు.
Read Also: Megastar Chiranjeevi: మేం ఏం చేయాలో కూడా మీడియా చెప్తే ఎలా?
ఈ నేపథ్యంలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి సంబంధిత శాఖ అధికారులు చేపట్టిన ధ్రువపత్రాల పరిశీలనకు విద్యార్హత పత్రాలను సమర్పించారా అని జర్నలిస్టులు అడగ్గా.. విద్యార్హతకు సంబంధించి ధ్రువపత్రాలను పంపాలని కోరడంతో తాను పంపానని కరణం ధర్మశ్రీ వెల్లడించారు. తన రాజీనామా ఆమోదం పొందితే చోడవరం లేదా దాని సమీపంలోని పీఎస్‌పేటలో టీచర్ పోస్టు వస్తే చేరిపోతానని సమాధానం ఇచ్చారు. కాగా ఏపీలో ఉపాధ్యాయ బదిలీలపై అయోమయం నెలకొంది. ఈ ఏడాది నిర్వహిస్తారా.. లేదా అనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.