భీమ్లానాయక్ సినిమా విడుదల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు విమర్శలు చేస్తున్న వేళ.. వైసీపీ ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది. టిక్కెట్ రేట్లు కావాలనే పెంచకపోవడం, అదనపు షోలకు అనుమతులు ఇవ్వకపోవడంపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. ఇప్పటికే మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. ఇలా పలువురు నేతలు పవన్‌పై ఎదురుదాడి చేస్తున్నారు. జగన్ హీరోగా సినిమా తీస్తే వెయ్యి రోజులు ఆడుతుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా విశాఖ జిల్లా అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రీమేక్ సినిమా భీమ్లానాయక్ కోసం చంద్రబాబు, లోకేష్ ఎన్ని రేటింగ్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఓ సున్నా అని ఆయన కామెంట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలు, అఖండ సినిమా గురించి చంద్రబాబు ఎందుకు ట్వీట్లు పెట్టలేదని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో సీబీఐ అనేది సీబీఎన్‌తో కలిసి పని చేస్తోందని ఆరోపించారు. కావాలనే ఈ కేసులో జగన్‌పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. వివేకా హత్య కేసులో సూత్రధారులు పాత్రధారులు బయటపడాలంటే చంద్రబాబు, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి కాల్ డేటా తీయాలని డిమాండ్ చేశారు. అటు టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చచ్చిన పాము అని.. ఆయన ఎక్కువగా మాట్లాడటం అనవసరమని వ్యాఖ్యానించారు.