వినాయక చవితి నేపధ్యంలో ప్రభుత్వ నిర్ణయాలపై బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు మండిపడ్డారు. సోము వీర్రాజుకు సిద్ధాంతం లేదు.. నోటికి అద్దూ అదుపు లేదని… నిత్యం రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని నిప్పులు చెరిగారు. కేంద్రం నుండి రావాల్సిన నిధులపై ఏపీ బీజేపీ నేతలు మాట్లాడటం లేదని.. ఆగస్టు 28న కేంద్ర హోమ్ శాఖ సెక్రటరీ జీవో ఇచ్చారని తెలిపారు. కోవిడ్ నేపధ్యంలో పండుగల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జీవోలో పేర్కొన్నారని… కరోనా వల్లే వైఎస్సార్ అవార్డులు, ఉపాధ్యాయ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిందని వివరించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా ప్రజలను అనుమతించలేదని… ప్రజల మేలు కోసమే వినాయక దినోత్సవాన్ని ఇళ్లలో జరుపుకోవాలని సూచించామన్నారు. అన్ని పండుగలకు పోలీసులు మాస్ గేదరింగ్ లు లేకుండా చూస్తున్నారని తెలిపారు. నిస్సిగ్గుగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని… సోము వీర్రాజు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని వెల్లడించారు. అన్ని సామాజిక వర్గాలను జగన్ సమానంగా చూస్తారన్నారు.