మూడు రాజధానులు, అమరావతి అంశంపై హైకోర్ట్ కీలక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై ఇప్పటికే రాజకీయపార్టీలు స్పందించాయి. తీర్పుని స్వాగతించారు సీపీఐ నేత రామకృష్ణ. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఆర్థికమంత్రి యనమల స్పందించారు. రాజధాని అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ముందు నుంచి టీడీపీ మూడు రాజధానుల బిల్లు చెల్లదని చెబుతూనే ఉంది.వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయం తీసుకొని, మూడు రాజధానులపై ముందుకు వెళ్ళింది.
హైకోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. హైకోర్టు తీర్పును గౌరవించి ప్రభుత్వం ముందుకు వెళ్లాలి మరో అప్పీలుకు వెళ్ళకూడదు. హైకోర్టు చెప్పిన విధంగా రాజధాని భూములు అభివృద్ధి చేసి ప్రభుత్వం రైతులకు అప్పగించాలన్నారు యనమల రామకృష్ణుడు. మూడు రాజధానుల ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ఇప్పటికే రాష్ట్ర అభివృద్ధి నాశనమైంది. ఇప్పటికే మూడేళ్లు వృధా చేశారు.
డివిజన్ బెంచ్ తీర్పును యధాతధంగా అమలు చేయాలి. కొత్త బిల్లు తీసుకొస్తామని చెప్పడం విచిత్రంగా ఉంది. విభజన చట్టం.. పార్లమెంట్ చేసింది.. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఏం చేసినా రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి. రాష్ట్ర శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో మూడు రాజధానులు బిల్లు పెట్టే సాహసం చేస్తుందని అనుకోవడం లేదు. ఇది అమరావతి రైతుల విజయం. ఆనాడు నిబంధనల ప్రకారం బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాం. నా నిర్ణయాన్ని ప్రభుత్వం తప్పు పట్టింది. ఈ తీర్పుతో మొదటి నుంచి టీడీపీ వాదన కరెక్ట్ అని తేలిందన్నారు షరీఫ్.