గుంటూరు జిల్లా కొలకలూరులో డయేరియా ప్రబలటంతో పదుల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రులు పాలవుతున్నారు. తెనాలి మండలం కొలకలూరులో కలుషిత నీరు తాగి ఇప్పటికే 40 మందికి పైగా అనారోగ్యం పాలయ్యారు. వీరందరికీ వైద్య పరీక్షలు జరిపి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. డయేరియా ప్రబలిందన్న సమాచారంతో కొలకలూరు చేరుకున్న జిల్లా ఉన్నతాధికారులు స్థానికంగా ప్రజలకు ధైర్యం చెప్పడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను జిల్లా ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. గ్రామంలో తాగునీటి శాంపిల్స్ ని ప్రయోగశాలకు పంపించి పరీక్షిస్తున్నారు. మరోవైపు ఘటనకు బాధ్యులైన వారిపై తీవ్రమైన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.
గ్రామంలో కలుషిత నీరు తాగి 40 మందికి పైగా డయేరియా వ్యాధిని బారినపడటంతో జిల్లా అధికారుల అప్రమత్తం అయ్యారు. తీవ్రమైన విరోచనాలు ,వాంతులతో ఇప్పటికే 40 మందికి పైగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం ఒక బాలిక చనిపోవడంతో అప్రమత్తమైన జిల్లా ఉన్నతాధికారులు గ్రామంలో వాలంటీర్లు మెడికల్ సిబ్బంది సహాయంతో ప్రతి ఇంటిలో వైద్య పరీక్షలు జరిపిస్తున్నారు. ప్రత్యేక వైద్య బృందాలను నియమించి ఘటనకు కారణాలు అన్వేషించడంతోపాటు కొలకలూరు గ్రామంలో డయేరియా వ్యాధి ఉన్న పడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు.
Agnipath Protests: ఆగని అగ్నిపథ్ ఆందోళనలు.. వరంగల్‌లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి తో పాటు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి ,ఇతర ప్రైవేట్ హాస్పిటల్ లో బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రెండు రోజుల నుంచి గ్రామంలో డయేరియా వ్యాధి ప్రబలుతున్న అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు… నిన్న ఓ బాలిక మృత్యువాత పడిన తరువాత పరిస్థితి తీవ్రతను గమనించిన అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో రాత్రి నుండి జిల్లా కలెక్టర్ స్వయంగా ఆ ప్రాంతంలో పర్యటించడం క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనులు, నీటి పంపిణీ ఎలా జరుగుతుందో తెలుసుకున్నారు…మరోవైపు డయేరియా వ్యాధిని పడి చికిత్స పొందుతున్న రోగులను జిల్లా ఉన్నతాధికారులు పరామర్శించారు.
అయితే కొలకలూరు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ,తాగే నీళ్లు ఉన్న పైపులు మురుక్కాలవల గుండా ప్రవహిస్తున్నాయని గ్రామస్తులు అంటున్నారు. మురుగు కాల్వలలో ఉన్న త్రాగు నీటి పైపులు లీకేజీ తో నీటి కుళాయిల ద్వారా మురుగునీరు త్రాగునీటిలో కలుస్తుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. గడిచిన మూడేళ్లుగా ఇదే పరిస్థితి ఉందని పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సమీపంలోని కాఫీ పొడి ఫ్యాక్టరీ నుండి వ్యర్ధాలను కాలువలోకి వదులుతున్నారని నీళ్లు తాగుతుంటే కాఫీ పొడి వాసన వస్తున్నాయని ఎన్నిసార్లు అధికారులకు చెప్పిన ఆ కంపెనీపై చర్యలు కూడా తీసుకోలేదని కొలకలూరు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటమే గాక పాడుబడిన బావులు,మురుగు గుంటలు పక్కన నీటి కుళాయిలు ఏర్పాటు చేశారు. వాటి నుండి సరఫరా అవుతున్న నీళ్లలో పురుగులు వస్తున్నాయని ఇప్పుడు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో వచ్చి అధికారులు హడావిడి చేస్తున్నారనీ బాధితులు అంటున్నారు. గ్రామంలో శాశ్వత ప్రాతిపదికన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ,తాగునీటి కుళాయిలను క్రమబద్ధీకరించాలని కొలకలూరు గ్రామస్తులు కోరుతున్నారు.