కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ వాళ్లు ప్రధానిపై అవాకులు, చవాకులు పేలుతున్నారని బీజీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో మీ శక్తి ఎంతని, సీపీఐకి దేశం లో ఓ ఎంపీ ఉన్నాడని ఆయన అన్నారు. సీపీఎం శక్తి ఎంత… కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోల్పోయిందని ఆయన అన్నారు. కమ్యూనిస్టులు రాష్ట్రంలో తోక పార్టీలుగా మిగిలాయని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యాలయాలు మూసివేశారని, ప్రధానిని విమర్శించే ముందు ఆత్మపరిశీలన చేసుకోండని ఆయన హితవు పలికారు. సీఎం జగన్ నివాసం ఉండే అమరావతి అభివృద్ధి కి రూ. 2,046 కోట్లు కేంద్రం ఇచ్చిందని, ఒక్క రూపాయి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదని ఆయన ఆరోపించారు. ఓ రాష్ట్ర మంత్రి పోలీసు అధికారిని బట్టలు ఉడదీస్తాం అంటే ఇప్పటి వరకు కేసు రిజిస్టర్ చేయలేదని ఆయన విమర్శించారు. విపక్ష నేతలు, సామాన్యులు ఇలాగా అని ఉంటే పోలీసులు బట్టలు విప్పి కొట్టేవారని ఆయన మండిపడ్డారు. అదే యూపీలో అయితే అప్పలరాజు ఈ పాటికి కటకటాల పాలయ్యేవారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.