Andhra Pradesh: విశాఖకు చెందిన సఖినేటిపల్లి వాసి అల్లూరి సరోజ అరుదైన ఘనత సాధించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈనెల 19న జరిగిన మిసెస్ ఆసియా యూఎస్ఏ పోటీల్లో విజేతగా నిలిచారు. ఈ టైటిల్‌ను గెలుచుకున్న తొలి దక్షిణ భారత తెలుగు మహిళగా సరోజ నిలిచారు. ప్రధాన టైటిల్‌తో పాటు ఆమెకు ‘మిసెస్ పాపులారిటీ’, ‘పీపుల్స్ ఛాయిస్ అవార్డులు’ కూడా దక్కాయి. అల్లూరి సరోజ ఫైనల్‌కు ముందు జరిగిన వివిధ రౌండ్‌లలో పోటీ పడ్డారు. తన విభాగంలో గ్రాండ్ ఫినాలేలో ‘నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్’, ఈవెనింగ్ గౌన్ రౌండ్’ అనే రెండు పోటీ రౌండ్‌లలో అత్యధిక స్కోర్ చేశారు. ఈ పోటీల్లో జపాన్, ఫిలిప్పీన్స్, చైనా, థాయ్‌లాండ్, మంగోలియా, ఇండోనేషియా వంటి దేశాలకు చెందిన మహిళలతో అల్లూరు సరోజ పోటీ పడి విజేతగా నిలవడం విశేషం.
Read Also: Bhakthi TV LIVE: సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే..?
కాగా అమెరికాలో ఐటీ ఉద్యోగం చేస్తున్న సరోజ.. తన భర్త, ఏడేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తెతో కలిసి లాస్‌ఏంజెల్స్‌లో నివసిస్తున్నారు. ఆమె వైజాగ్‌లో పుట్టి పెరిగారు. ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీతో పాటు న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆమె ప్రస్తుతం AT&T కంపెనీలో టెక్నాలజీ లీడర్‌గా పని చేస్తున్నారు. సరోజకు ఏడేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. ఆమె అభిరుచి గల డ్యాన్సర్, ఫ్యాషన్ డిజైనర్, వ్యవస్థాపకురాలు కూడా. ఆమె అనేక లాభాపేక్ష లేని సంస్థల కోసం స్వచ్ఛందంగా నిధులను సేకరిస్తున్నారు. ఆమె ‘ఉమెన్ ఇన్ టెక్’లో విలువైన సభ్యురాలిగా ‘అడ్మిరబుల్ అచీవర్’ అవార్డు కూడా పొందారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా సఖినేటిపల్లికి చెందిన సరోజ తల్లిదండ్రులు రాంబాబు, పార్వతి ఉద్యోగ రీత్యా విశాఖలో స్థిరపడ్డారు. సరోజ మిసెస్ ఆసియా టైటిల్ గెలవడం పట్ల ఆమె చిన్నాన్న అల్లూరి ప్రసాదరాజు, ఇతర కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.