Havey Rain Alert: ఏపీకి మరోసారి వాన గండం పొంచి ఉంది. ప్రస్తుతం పశ్చిమమధ్యబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా కొనసాగుతోంది. ఇది రేపు ఉదయం తీరం దాటే ప్రమాదం ఉందంటోంది వాతావరణశాఖ. దీంతో ఏపీ ప్రజల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి 300 కి.మీ., గోపాల్‌పూర్‌కు 300 కి.మీ., పారాదీప్‌కు 400 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.ఈ వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి శుక్రవారం తెల్లవారుజామున ఒడిశా-ఆంధ్ర తీరాలను గోపాల్‌పూర్ పారాదీప్ మధ్య దాటే అవకాశం ఉందని హెచ్చరించారు.
Read Also: Star Hero : స్టార్ హీరో కొడుకు తిరిగొచ్చాడు.. ట్రైలర్ రిలీజ్ చేసాడు..
వీటి ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు, దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండకూడదని, పొంగిపొర్లే వాగులు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదని విజ్ఞప్తి చేశారు.
ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని, మిగిలిన జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు అధికారులు.
నిన్న సాయంత్రం 6 గంటల నాటికి గోదావరి నది భద్రాచలం వద్ద 44.90 అడుగుల నీటిమట్టం నమోదైందని, ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద 12.72 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి మొదటి హెచ్చరిక కొనసాగుతోందని తెలిపారు ప్రాజెక్టు అధికారులు. ప్రకాశం బ్యారేజి వద్ద 6.08 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో నమోదై రెండవ ప్రమాద హెచ్చరిక అమల్లో ఉందన్నారు.కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం ఇవాళ్టి నుంచి క్రమంగా తగ్గుతుందని, పూర్తిగా తగ్గే వరకు నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు.