విధి వక్రీకరించడంతో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సీఐ అనంతలోకాలకు పయనమయ్యాడు. ఈ విషాద ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. పట్టణంలోని త్రీటౌన్‌లో సీఐగా విధులు నిర్వహిస్తున్న ఈశ్వరరావు విధులు ముగించుకొని తెల్లవారుజామున ఇంటికి బయలు దేరారు. అయితే ఎండాడ వద్ద గల జాతీయ రహదారిపై 3.40 గంటలకు గుర్తుతెలియని వాహనం వచ్చి సీఐ ఉన్న పోలీసు వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో సీఐ అక్కడికక్కడే మృతి చెందాడు.
సీఐతో పాటు ఉన్న కానిస్టేబుల్ సంతోష్ కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసు జీపును ఢీకొట్టిన వాహనం గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. సీఐ ఈశ్వరరావు మృతి దురదృష్టకరమని సీపీ మనీష్ కుమార్ సిన్హా అన్నారు. పదవీ విరమణకు రెండేళ్లు ఉన్న తరుణంలో ప్రమాదం బాధకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండగా ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్ సంతోష్ పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.