Ayesha Meera Murder Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన బీపార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. ఆయేషా మీరా హత్య కేసు 17 ఏళ్ల నుంచి అనేక మలుపులు తిరుగుతూ ఇంకా మిస్టరీగానే మిగిలింది. 2007 డిసెంబరు 27న రాత్రి ఇబ్రహీంపట్నంలో దుర్గా లేడీస్ హాస్టల్ లో బీఫార్మసీ చదువుతున్న ఆయేషా మీరా అత్యాచారం, హత్యకు గురైంది. ఆయేషామీరాను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసి బాత్ రూమ్ లో మృతదేహాన్ని వదిలి నిందితుడు పరారయ్యాడు. మృతదేహంపై చిరుత అని కూడా రాసి వెళ్లాడు. జాతీయ రహదారిపై హాస్టల్ ఉండటంతో హత్య చేసి హైవేపైకి వెళ్లి పరారాయ్యాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ హత్య తీవ్ర కలకలం రేపింది. కేసును విచారించి విజయవాడ పోలీసులు దర్యాప్తులో భాగంగా దాదాపు 150 మంది యువకులను అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. సంఘటన జరిగిన తర్వాత ఏడాది కాలానికి.. 2008 ఆగస్టులో నందిగామకు చెందిన సత్యంబాబును అరెస్టు చేశారు. సత్యంబాబు.. ఆయేషా మీరాను అత్యాచారం చేసి హత్య చేశాడని పోలీసులు కోర్టుకు ఛార్జిషీట్ లో నివేదించారు. ఈ కేసుపై విచారణ జరిపిన విజయవాడలోని మహిళా సెషన్స్ కోర్టు.. సత్యంబాబుకు జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పుపై సత్యంబాబు 2010లో హైకోర్టులో అప్పీలుకు వెళ్లారు. విచారణ జరిగిన డివిజన్ బెంచ్ 2017 మార్చి 31న సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. పోలీసు దర్యాప్తు సక్రమంగా జరగలేదని కోర్టు అభిప్రాయపడింది. సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. దర్యాప్తు అధికారులపై చర్యలు తీసుకోవాలని తీర్పులో పేర్కొంది.
మొదటి నుంచి కూడా ఆయేషా మీరా తల్లిదండ్రులు సత్యంబాబు ఈ కేసులో నిందితులు కాదని దర్యాప్తు అధికారులకు చెబుతూనే వచ్చారు. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్ సహా పలువురిపై ఆయేషా మీరా తల్లి షంషద్ బేగం అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సత్యంబాబు ఈ హత్య కేసులో తొమ్మిదేళ్లపాటు జైలు శిక్ష అనుభవించాడు. 2017లో ఆయేషా మీరా హత్య కేసు సరిగా విచారణ చేయటంలేదని అయేషా తల్లి షంషద్ బేగంతోపాటు ముగ్గురు మహిళా హక్కుల యాక్టివిస్టులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం దర్యాప్తు పూర్తి నివేదిక పరిశీలించి అప్పీలుకు వెళ్లకూడదని నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాలతో అప్పటి ప్రభుత్వం ఆయేషా మీరా హత్యపై సిట్ ను ఏర్పాటు చేసింది. దీనికి నాటి విశాఖ రేంజ్ డీఐజీ శ్రీకాంత్ నేతృత్వం వహించారు. సిట్ దర్యాప్తు సక్రమంగా సాగక పోవడంతో ఆయేషా తల్లి హైకోర్టును ఆశ్రయించారు. సిట్ తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. సీబీఐకి దర్యాప్తు బాధ్యతలను 2018 నవంబర్ లో అప్పగించింది. ఆధారాల ధ్వంసం విషయాన్ని సిట్ అధికారులు హైకోర్టుకు తెలపడంతో విచారణకు ఆదేశించింది. దీంతో 2018 నుంచి 2025 వరకు ఏడేళ్లపాటు సుదీర్ఘ విచారణ జరిపి చివరికి తుది నివేదికను ఇటీవల హైకోర్టుకు అందజేసింది. ఈ రిపోర్ట్ ను తమకు ఇవ్వటంలేదని తాజాగా ఏపీ హైకోర్టులో ఆయేషా మీరా తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు.
2018లో రీ ఇన్వెస్టిగేషన్ ను సీబీఐ మొదలుపెట్టింది. ఆయేషామీరా హత్య, దిగువ కోర్టులో ఆధారాల మాయంపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేసింది. ఏడేళ్ల దర్యాప్తులో 260 మంది సాక్షులను విచారించింది. 2610 డాక్యుమెంట్స్ సీజ్ చేసింది. అప్పట్లో కేసు దర్యాప్తు చేసిన 50 మంది పోలీసులు, ఆయేషా ఉన్న హాస్టల్లోని విద్యార్థులు, సిబ్బంది 25 మందిని సీబీఐ పిలిపించి ప్రశ్నించింది. ఆయేషామీరా తల్లి అనుమానాలు వ్యక్తం చేసిన కోనేరు సతీష్, చింతా పవన్ కుమార్, అబ్బూరి గణేష్, హాస్టల్ వార్డెన్ పద్మను విచారించారు. విదేశాల్లో ఉన్న వారిని కూడా పిలిపించి సీబీఐ విచారించింది. కోర్టు నిర్ధోషిగా తేల్చిన సత్యంబాబును నందిగామ సమీపంలోని సత్యంబాబు స్వగ్రామం అనాసాగరం వెళ్లి క్షుణ్నంగా విచారించారు. ఆయేషా మీరా స్వస్థలం తెనాలి కూడా సీబీఐ బృందం విచారణ చేపట్టింది. ఆయేషాను ఖననం చేసిన ప్రాంతంలో తవ్వి.. అస్తికలను స్వాధీనం చేసుకుని హైదరాబాద్.. గాంధీ వైద్య కళాశాలలో రీపోస్టుమార్టం నిర్వహించారు. డీఎన్ఏ పరీక్షలూ చేయించారు. దిగువ – కోర్టులో ఆధారాలను ధ్వంసం చేసిన అభియోగాలు ఎదుర్కొన్న సిబ్బంది వెంకట కుమార్, సుబ్బారెడ్డి, కుమారిలను సుదర్ఘంగా విచారించారు. ఆధారాలను ఎందుకు ధ్వంసం చేశారు? ఎవరి ఆదేశాల మేరకు దీనికి పాల్పడ్డారనే కోణంలో ప్రశ్నించారు.
Read Also: Pregnant Woman: మహరాష్ట్ర ఆస్పత్రిలో దారుణం.. గర్భిణీ పొత్తికడుపుపై యాసిడ్..
సంచలనం సృష్టించిన ఆయేషామీరా హత్య కేసుపై సీబీఐ పూర్తి స్థాయి విచారణ చేపట్టినా ఏడేళ్లకు తుది నివేదికను హైకోర్టుకు ఇచ్చింది. ఆయేషా మీరా అత్యాచారం, హత్య కేసులో నివేదికను హైకోర్టు సూచనతో విజయవాడలోని సీబీఐ కేసులు విచారించే ప్రత్యేక కోర్టులో సమర్పించింది. 17 ఏళ్ల కిందట జరిగిన ఘటనపై సీబీఐ పునర్ దర్యాప్తులో ఏం తేల్చిందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నివేదిక ప్రతి కోసం ఆయేషా తల్లిదండ్రులు దరఖాస్తు చేశారు. బాధితులుగా ఉన్న తమకు నివేదిక కాపీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నివేదికలో నిందితులు ఎవరు, సత్యంబాబు పాత్ర గురించి ఏం తేల్చింది అనే అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి. గతంలో ఆయేషా మీరా తల్లి అనుమానాలు వ్యక్తం చేసిన వారి పాత్ర ఉందా లేక వేరే వారు హత్య చేసినట్టు నిర్ధారించారా? అనేది రిపోర్టులో ఉంది. ఈ నివేదిక బయటకు వస్తే కానీ అసలు విషయాలు తెలిసే అవకాశాలు లేవు. రిపోర్టు చూసిన తర్వాత దానిపై కూడా అనుమానాలు ఉంటే భవిషత్యు కార్యాచరణ ఉంటుందని అయేషా మీరా తల్లిదండ్రులు చెబుతున్నారు. విచారణ పేరుతో సీబీఐ తనను ఇబ్బంది పెడుతోందని, తుది నివేదిక ద్వారాపైనా దాని నుంచి బయట పడతానని సత్యంబాబు చెబుతున్నారు. సీబీఐ తుది నివేదక ద్వారాపైనా ఆయేషా మీరా హత్య కేసు మిస్టరీ వీడుతుందో ఇంకా కొనసాగుతుందో చూడాల్సి ఉంది.