Vijayawada: విజయవాడలోని ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. ఈ రోజు నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు భవానీ దీక్షా విరమణలు కొనసాగనున్నాయి. ప్రతి ఏడాది భవానీల సంఖ్య పెరుగుతుంది. ఇరుముడులను సమర్పించేందుకు మూడు హోమగుండాలను ఏర్పాటు చేశారు. 41 రోజుల పాటు నియమ నిబంధనలు పాటిస్తూ భవానీ మాలధారణ వేసిన వారికి ప్రత్యేక క్యూ లైన్లు, వెయిటింగ్ హాల్స్, అదనపు పార్కింగ్, 19 ప్రసాదం కౌంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి 7 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. లక్షలాదిగా తరలి వచ్చే భవానీలకు మంచి నీరు, ప్రసాదం కొరత లేకుండా అందించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.
Read Also: Trump: అమెరికా పౌరసత్వానికి ‘గోల్డెన్ ఆఫర్’.. శుభవార్త చెప్పిన ట్రంప్
ఇక, 950 మంది క్షురకులు, 4 వేల మంది పోలీసు సిబ్బంది, 370+ CCTV కెమెరాలతో భద్రతను పటిష్టం చేశారు. అన్ని అర్జీత సేవలు డిసెంబర్ 11 నుంచి 16 వరకు నిలిపివేసినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. గిరి ప్రదక్షిణ మార్గంపై వివరాలను అందించే భవానీ దీక్ష 2025 మొబైల్ యాప్‌ను ఏర్పాటు చేశారు. 9 కిలో మీటర్ల మేర గిరి ప్రదక్షిణ కొనసాగనుంది. సామాన్య భక్తుడికి పెద్ద పీఠం వేస్తూ అని లైన్లు ఉచిత క్యూలైన్లుగా మార్చేశారు అధికారులు.